అభిషేక్ బచ్చన్ కెరీర్ గమనంపై తండ్రి ఆశీర్వాదం

Share


బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు. దాదాపు 25 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ, తండ్రి స్థాయికి ఎదగలేకపోయాడనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, అప్పుడప్పుడూ గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. కానీ, స్టార్ ఇమేజ్ మాత్రం సంపాదించలేకపోయాడు.

తన బాక్సాఫీస్ ఫెయిల్యూర్లు గురించి సెటైర్లు సహజమే. అయితే, ఈ విమర్శలు అభిషేక్‌ను తీవ్రంగా గాయపరిచాయి. కొన్నిసార్లు సినిమాలను పూర్తిగా వదిలిపెట్టి, బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నానని అభిషేక్ స్వయంగా వెల్లడించాడు.

అయితే, అదే సమయంలో తండ్రి అమితాబ్ బచ్చన్ అతనికి ధైర్యం చెప్పారని అభిషేక్ తెలిపారు. “సినిమాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. నటుడిగా విభిన్నమైన చిత్రాలతో అలరించాలనేదే నా లక్ష్యం. కానీ, ఆశించిన గుర్తింపును పొందలేక పోయా. దాంతో సినిమాలు మానేయాలని అనుకున్నా. తండ్రితో ఈ విషయం చెప్పినప్పుడు, ఆయన ఒక్క మాట అన్నారు.”

‘ఇప్పుడే నీ ప్రయాణం మొదలైంది. నువ్వు ఇంకా చాలా దూరం వెళ్లాలి. ఈ మార్గంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ప్రతి సినిమా నీకు కొత్త పాఠం నేర్పుతుంది. పోరాడుతూ ముందుకు సాగితే, ఒకరోజు నువ్వు నీ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తావు’ అని అన్నారు.

నాన్న మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని, అదే తనను తిరిగి సినిమాలవైపు నడిపించిందని అభిషేక్ వెల్లడించాడు. “ఫెయిల్యూర్లు లేకుండా ఎవ్వరూ విజయాన్ని అందుకోలేరు. ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే నా ప్రయాణాన్ని కొనసాగించగలిగాను” అని చెప్పాడు.

అభిషేక్ నటించిన తాజా చిత్రం ‘బి హ్యాపీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా తన నటనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాడు.


Recent Random Post: