
పరిణతి ఉన్న స్క్రిప్ట్ ఎంపికలతో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అభిషేక్ బచ్చన్ ఇటీవల చర్చనీయాంశంగా మారాడు. తన తండ్రి అమితాబ్ స్థాయిలో స్టార్డమ్ అందుకోకపోయినా, అభిషేక్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటూ, పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్నాడు. అయితే, తెలివైన పెట్టుబడులతో “డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు” అనే ఫార్ములాను అన్వయిస్తూ, ఆర్థికంగా తన తండ్రిని మించిపోతున్నాడని చెప్పొచ్చు.
అభిషేక్ కేవలం సినిమాలతోనే కాకుండా, క్రీడలు, లగ్జరీ ఆటోమొబైల్స్, స్టార్టప్‌లు, రియల్ ఎస్టేట్ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతూ, 2024 నాటికి సుమారు రూ. 280 కోట్ల నికర ఆస్తిని కూడగట్టుకున్నాడు.
అభిషేక్ గ్యారేజ్‌లో లగ్జరీ కార్ల కొరత లేదు. రూ. 3.29 కోట్ల బెంట్లీ కాంటినెంటల్ జీటీ, రూ. 2 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ W221, మెర్సిడెస్-బెంజ్ జీటీ 63 AMG, రూ. 1.58 కోట్ల ఆడి A8L వంటి హై-ఎండ్ కార్లను కలిగి ఉన్నాడు.
ఇటీవల తన తండ్రి అమితాబ్‌తో కలిసి భారీగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టిన అభిషేక్, జూన్ 2024లో ముంబై బోరివలిలో రూ. 15 కోట్లకు ఆరు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. అదనంగా, 2015లో ముంబై వర్లిలోని స్కైలార్క్ టవర్స్‌లో రూ. 21 కోట్ల విలువైన 5-BHK విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసాడు. అంతేకాకుండా, దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో ఓ విలాసవంతమైన విల్లా కూడా అభిషేక్ సొంతం చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడమే కాదు, వాటిని వ్యూహాత్మకంగా రీసేల్ చేస్తూ కూడా మంచి లాభాలు పొందుతున్నాడు.
అభిషేక్ భార్య, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆస్తుల విలువ సుమారు రూ. 800 కోట్లు. భార్యతో పోలిస్తే “స్మాల్ బి”గా పేరొందిన అభిషేక్ ఆస్తుల విలువ తక్కువే అయినా, ఆయన పెట్టుబడులు, వ్యాపార దృష్టి గమనిస్తే భవిష్యత్తులో మరింత ఎదిగే అవకాశాలున్నాయి.
ఇటీవల నటుడిగా ప్రశంసలు అందుకున్న అభిషేక్, ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ 4 లో తిరిగి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. అదనంగా, గులాబ్ జామున్, డ్యాన్సింగ్ డాడ్ వంటి చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. అన్ని విధాలుగా అభిషేక్ తన మార్క్‌ను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
Recent Random Post:















