
శివ కార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ సినిమా థియేటర్లలో అద్భుత విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు, తమిళ భాషల్లో సమానంగా ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.330 కోట్ల గ్రాండ్ కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా శివ కార్తికేయన్‌కు ఈ చిత్రం తమిళనాట స్టార్ హీరో హోదా తీసుకువచ్చింది. ఇక, సాయి పల్లవి ఈ సినిమాతో మరోసారి తన నటనను ప్రూవ్ చేసుకుంది.
థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ లోనూ సూపర్ హిట్ అయింది. విడుదలైన వెంటనే వరుసగా మూడు, నాలుగు వారాల పాటు ట్రెండింగ్‌లో కొనసాగింది. ఇందులో శివ కార్తికేయన్ పాత్ర, సాయి పల్లవి నటనపై విస్తృతంగా చర్చ జరిగింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా, తెలుగు వెర్షన్ బుల్లితెరపై ప్రీమియర్ అయ్యింది. ఊహించిన దానికంటే ఎక్కువ రేటింగ్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి టెలికాస్ట్‌లోనే 9.10 రేటింగ్ నమోదు చేసుకొని, సలార్, కల్కి వంటి భారీ సినిమాల రేటింగ్స్‌ను దాటేసింది. ఇది ఇటీవల కాలంలో ఒక డబ్బింగ్ తమిళ్ సినిమాకు వచ్చిన అత్యధిక రేటింగ్‌గా నిలిచింది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దేశభక్తిని ప్రధానాంశంగా తీసుకుని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా సమపాళ్లలో మేళవించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోవడంతో బుల్లితెరపైనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కమల్ హాసన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. జీవి ప్రకాష్ అందించిన సంగీతం కూడా అమరన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. థియేటర్, ఓటీటీ, ఇప్పుడు బుల్లితెర – అన్ని వేదికల మీద అమరన్ తన సత్తా చాటింది!
Recent Random Post:















