అల్లు అర్జున్ కొత్త చిత్రానికి సాయి అభ్యాంకర్ సంగీతం

Share


గంగోత్రి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే తన నటనను నిరూపించుకున్న అల్లు అర్జున్ — ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ, తన నటనలో కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ, నేడు ఐకాన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా కూడా రికార్డు సృష్టించారు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న అల్లు అర్జున్, దానికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించారు. సుమారు ₹1400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, భారతీయ చలనచిత్ర చరిత్రలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇప్పుడంతా ఆయన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టగా, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా ప్రకటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి VFX సంస్థలు, అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేసిన బృందాలు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి.

ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? అనే చర్చ గత కొన్ని రోజులుగా సాగుతుండగా, అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియాలో దానికి ముగింపు పలికారు. తాజాగా, డ్యూడ్ చిత్రానికి సంగీతం అందించి మంచి గుర్తింపు పొందిన యువ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

ఈరోజు సాయి అభ్యాంకర్ పుట్టినరోజు కావడంతో, అల్లు అర్జున్ సోషల్ మీడియాలో “నా సోదరుడు SAK కి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం విజయాలతో, కీర్తితో నిండిపోవాలి” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దీతో సాయి అభ్యాంకర్ ఈ భారీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికైనట్లు స్పష్టమైంది.

అయితే, ఈ నిర్ణయం అభిమానుల్లో ఉత్సాహం రేపినప్పటికీ, కొందరు నెటిజన్లు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క సినిమాతో గుర్తింపు పొందిన యువ సంగీత దర్శకుడిని వందల కోట్ల బడ్జెట్ ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు తీసుకోవడం రిస్క్ కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే, ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తారని వార్తలు వస్తుండగా, చివరికి సాయి అభ్యాంకర్ ఎంపిక కావడంతో, ఇది అల్లు అర్జున్ తీసుకున్న ధైర్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ నిర్ణయం ఎంతవరకు ఈ సినిమాకి ప్లస్ అవుతుందో, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Recent Random Post: