ఆరోగ్యంగా ఉన్న సుధాకర్ – సినీ రంగంలో ఎంట్రీకి సిద్ధమవుతున్న కుమారుడు బెన్నీ

Share


మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధాకర్, తొలినాళ్లలో తెలుగు, తమిళ సినిమాల్లో హీరోగా నటించారు. అయితే కాలక్రమేణా ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా. హీరోగా కొనసాగకపోయినా, సుధాకర్ టాలీవుడ్ అగ్ర హీరోలందరి సినిమాల్లో తనదైన స్టైల్‌లో నవ్వులు పూయించారు.

అయితే గత కొన్నేళ్లుగా సుధాకర్ ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొన్న ఇబ్బందులు మీడియాలో పెద్ద ఎత్తున హెడ్లైన్స్ అయ్యాయి. 60 ఏళ్లు దాటిన తర్వాత ఆయన మూడున్నర నెలలపాటు కోమాలో ఉన్నారని, మద్యం అలవాటు కారణంగా పరిస్థితి మరింత క్లిష్టమైందని వార్తలు వచ్చాయి. అలాగే ఆర్థికంగా కూడా కుటుంబం బాగా ఇబ్బందులు పడుతోందన్న ప్రచారం జరిగింది.

కానీ తాజా ఇంటర్వ్యూలో సుధాకర్, ఆయన కుమారుడు బెన్నీ ఈ వార్తలపై స్పష్టతనిచ్చారు. నిజానికి కోమాలో ఉన్నా అది కేవలం 30 రోజులు మాత్రమేనని తెలిపారు. అలాగే ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఎప్పుడూ దారుణ పరిస్థితి తలెత్తలేదని చెప్పారు. చెన్నైలో 600-700 కోట్ల విలువైన ఆస్తులున్నాయని వచ్చిన వార్తలను వారు పూర్తిగా ఖండించారు.

సుధాకర్ కెరీర్ విషయానికి వస్తే, తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక్క సినిమాకు 30,000 రూపాయల పారితోషికం తీసుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పీక్‌లో ఉన్నప్పుడు మాత్రం రోజుకి లక్షల్లో రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటులతో పోటీగా మంచి పేరు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం సుధాకర్ ఆరోగ్యంగా ఉన్నారని, వారానికి ఒకసారి చర్చికి వెళ్తానని స్వయంగా వెల్లడించారు. ఆయన కుమారుడు బెన్నీ అచ్చం తండ్రిలా కనిపించడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే బెన్నీ కూడా సినీ రంగంలో నటుడిగా పరిచయం కానున్నాడని సుధాకర్ తెలిపారు.


Recent Random Post: