
97వ అకాడమీ అవార్డుల విజేతలు ప్రకటించబడిన నేపథ్యంలో, భారతదేశం నుంచి పోటీపడిన లఘు చిత్రం ‘అనుజ’ చివరి నిమిషంలో అవార్డు చేజార్చుకుంది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో, ‘అనుజ’ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం కేటగిరీలో పోటీ పడిన ఈ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంటుందని చాలా మంది విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, చివరికి డచ్ సైన్స్ ఫిక్షన్ లఘు చిత్రం ‘I Am Not a Robot’ విజేతగా నిలిచింది.
ఈ విభాగంలో ‘ది లాస్ట్ రేంజర్, ఎ లియెన్, ది మ్యాన్ హూ కుడ్ నాట్ రిమైన్ సైలెంట్’ వంటి బలమైన చిత్రాలు పోటీ పడగా, చివరకు ‘I Am Not a Robot’ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం కథానాయిక లారా CAPTCHA పరీక్షలలో పదేపదే విఫలమవుతుంటే, తన గురించి ఒక ప్రత్యేకమైన నిజాన్ని కనుగొనడం చుట్టూ తిరుగుతుంది. 2023 సెప్టెంబర్‌లో నెదర్లాండ్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఈ చిత్రం, టెక్నాలజీ మరియు ఐడెంటిటీ పై కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉంటే, ‘అనుజ’ అమెరికన్ హిందీ భాషా లఘు చిత్రం కాగా, ఇద్దరు సోదరీమణుల జీవిత పోరాటం చుట్టూ తిరుగుతుంది. తత్వవేత్తగా ఉన్న ఆడమ్ జె. గ్రేవ్స్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో సజ్దా పఠాన్, అనన్య షాన్భాగ్, నగేష్ భోంస్లే ప్రధాన పాత్రలు పోషించారు. ఒక తొమ్మిదేళ్ల ప్రతిభావంతురాలైన అనుజ, ఆమె సోదరి పాలక్ జీవితాన్ని మార్చే ఓ అవకాశాన్ని అందిపుచ్చుకునే పోరాటం ఈ కథ యొక్క కేంద్ర బిందువు. ప్రపంచవ్యాప్తంగా పేద యువతుల ఆత్మవిశ్వాసాన్ని, అవకాశాల కోసం చేసే పోరాటాన్ని చిత్రంలో అందంగా ప్రతిబింబించారు.
‘అనుజ’ 2024 ఆగస్టు 17న హోలీషార్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ కాగా, ఆస్కార్ అవార్డును చేజిక్కించుకోలేకపోయినా, అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో నామినేషన్ పొందడం చిత్రానికి మరింత ప్రచారం తీసుకొచ్చింది. ప్రముఖ నిర్మాతలు మిండీ కాలింగ్ – గుణీత్ మోంగా కపూర్ మద్దతుతో, ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రం, ఆస్కార్ రేసులో నిలిచినందుకు గర్వించదగిన విషయం.
అవార్డు గెలవలేకపోయినప్పటికీ, ‘అనుజ’ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Recent Random Post:















