
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఇటీవల శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చికిత్సలో ఉన్న సమయంలోనే కొందరు సోషల్ మీడియాలో ఆయన మరణించారని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ రూమర్లపై ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ మరియు భార్య హేమమాలిని స్పష్టతనిస్తూ — “ధర్మేంద్ర ఆరోగ్యంగానే ఉన్నారు, పూర్తిగా కోలుకుంటున్నారు. ఇలాంటి అబద్ధపు వార్తలు పంచకండి” అని విజ్ఞప్తి చేశారు.
ధర్మేంద్ర ఇప్పటికే కోలుకుని ఇంటికి కూడా వెళ్లారు. అయితే ఆయనను చూడటానికి మరో బాలీవుడ్ స్టార్ గోవిందా సోమవారం సాయంత్రం బ్రీచ్ కాండీ హాస్పిటల్‌కి వెళ్లినట్లు సమాచారం. కానీ, గోవిందా తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి 1 గంట సమయంలో ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు జుహూలోని క్రిటికేర్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు.
గోవిందా హాస్పిటల్లో కనిపించినప్పుడు కూడా కొంత నీరసంగా ఉన్నారని, ఆయన వీడియోలు చూసిన నెటిజన్లు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే — “ధర్మేంద్ర పరిస్థితి చూసి గోవిందా షాక్‌కి గురై ఉండవచ్చు” అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక గోవింద వ్యక్తిగత జీవితంలో కూడా ఇటీవల కొంత కలత నెలకొంది. ఆయన భార్య సునీతతో విభేదాలు కొనసాగుతున్నాయని, విడాకుల దిశగా వెళ్తున్నారని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గోవిందకు ఓ మరాఠీ నటితో సంబంధం ఉందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలి ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ — “మరో జన్మ వచ్చినా గోవిందా నా భర్తగా వద్దు. ఆయన మంచి తండ్రి, మంచి సోదరుడు కానీ మంచి భర్త కాలేకపోయాడు” అని చెప్పడం సంచలనం రేపింది. అలాగే, “గోవిందకు ఎఫైర్ ఉందని నాకు తెలుసు. కానీ 38 సంవత్సరాల తర్వాతే అది గ్రహించాను” అని ఆమె వెల్లడించింది.
ఇక తాజా ఘటనలో గోవిందా ఆసుపత్రిలో చేరడంతో, అభిమానులతో పాటు సునీత కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Recent Random Post:















