జన నాయగన్ ఆడియో లాంచ్‌కు రికార్డు హైప్

Share


దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ స్థాయి స్టార్ పవర్‌కు మరోసారి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది జన నాయగన్ ఆడియో లాంచ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్ను హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, ప్రేమలు ఫేమ్ మమితా బైజు, రెబా మోనికా, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనుండగా, యానిమల్ స్టార్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

విజయ్ రాజకీయాల్లో క్రియాశీలంగా ప్రవేశించనున్న నేపథ్యంలో, ఇది ఆయన నటిస్తున్న చివరి సినిమా కావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే జన నాయగన్పై అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రూపొందిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా జనవరి 9న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో జన నాయగన్ ఆడియో లాంచ్‌ను డిసెంబర్ 27న మలేషియాలోని కౌలాలంపూర్‌లో అత్యంత గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు దాదాపు 90 వేల మంది అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమవడంతో విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో కౌలాలంపూర్‌కు తరలివెళ్తున్నారు.

ఆడియో లాంచ్‌లో రాజకీయ అంశాలపై మాట్లాడవద్దంటూ పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఈవెంట్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో, సినిమాలకు గుడ్ బై చెప్పే విషయంపై విజయ్ అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఊపందుకుంది.

ఈ హైప్‌కు నిదర్శనంగా చెన్నై నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న ఎయిర్‌బస్ A320 విమానం పూర్తిగా దళపతి అభిమానులతో నిండిపోవడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనను చూపించే వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఒక హీరో కోసం, అదీ విదేశంలో జరుగుతున్న ఆడియో ఫంక్షన్ కోసం ఇంత భారీ స్థాయిలో అభిమానులు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని వెళ్లడం ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతటి క్రేజ్ మరే హీరోకు లేదని, విజయ్ అభిమానులను ఆ స్థాయిలో ప్రభావితం చేయగలిగాడని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెడుతున్న నేపథ్యంలో జన నాయగన్ ఆయన చివరి సినిమా అవుతుందా? లేక పవన్ కళ్యాణ్ తరహాలో సినిమాలు కొనసాగిస్తాడా? అన్నది మరికొన్ని గంటల్లోనే స్పష్టత రానుంది.


Recent Random Post: