జానపద రొమాంటిక్ సాంగ్‌తో రవితేజ కొత్త ప్రయోగం

Share


మాస్ రాజా రవితేజ‌, ఆషీకా రంగనాథ్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సున్నితమైన భావోద్వేగాలు, వినోదం కలగలిపిన కథలను చెబడంలో ప్రత్యేకత కలిగిన దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ ఇమేజ్‌కు కాస్త భిన్నంగా, రవితేజ క్లాస్ టచ్‌తో కనిపించబోతున్న ఈ సినిమా, ఆయన కెరీర్‌లో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నంగా నిలుస్తోంది.

ఇప్పటికే కిషోర్ తిరుమల తెరకెక్కించిన పలు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. డిజాస్టర్ అనిపించే సినిమా ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు లేదు. అందుకే ఆయన సినిమాపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ కనీస అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్‌లో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

తాజాగా రవితేజ, ఆషీకా రంగనాథ్‌లపై ఒక పాటను భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ పాట జానపద నేపథ్యంలోని రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌గా రూపొందుతోందని తెలుస్తోంది. రవితేజ ఇటీవలి కాలంలో మాస్ బీట్ సాంగ్స్‌లో ఎక్కువగా కనిపిస్తుండగా, ఈసారి మాత్రం భిన్నమైన జానపద రొమాంటిక్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

హీరో-హీరోయిన్ల మధ్య ఉండే ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ, కథలో సహజంగా మిళితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కథకు అనుగుణంగా పాటలను మలచడంలో కిషోర్ తిరుమలకు ఉన్న అభిరుచి ప్రత్యేకం. అందుకే ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో భీమ్స్ ఒకరు. ఆయన సంగీతం ఉన్న సినిమాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో, ఈ ప్రాజెక్టుపై కూడా మంచి బజ్ నెలకొంది.

మ్యూజిక్‌పై మంచి అభిరుచి ఉన్న దర్శకుడు కిషోర్ తిరుమల, ఈసారి కూడా పాటలతో సినిమాను మ్యూజికల్ హిట్‌గా నిలపాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉండగా, ఈ చిత్రం కొత్త సంవత్సరంలో విడుదల కానుందని సమాచారం. విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


Recent Random Post: