ట్రోల్స్‌పై ఎమోషనల్ అయిన అనసూయ.. జూమ్ ప్రెస్ మీట్‌లో కన్నీటి వ్యాఖ్యలు వైరల్

Share


జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అద్భుతమైన వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెర క్వీన్‌గా భారీ పాపులారిటీ దక్కించుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు జబర్దస్త్‌కు నిరంతర యాంకర్‌గా పనిచేసిన అనసూయ, ఆ తర్వాత వెండితెరపైకి అడుగుపెట్టింది.

సినిమాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, రంగస్థలం, రజాకార్, పుష్ప వంటి చిత్రాలతో మంచి ప్రశంసలు, విజయాలు అందుకుంది. నటనతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, అప్పుడప్పుడు అనవసర వివాదాల్లో చిక్కుకుని విమర్శల పాలవుతుంటుంది.

ఇటీవల శివాజీ వివాదంలో తలదూర్చిన నేపథ్యంలో ట్రోల్స్ ఎదుర్కొన్న అనసూయ, తాజాగా భావోద్వేగానికి లోనై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల జరిగిన జూమ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఆమె, తనకు లభించిన మద్దతు తనను తీవ్రంగా ఎమోషనల్ చేసిందని వెల్లడించింది.

“నేను చాలా స్ట్రాంగ్ వ్యక్తిని. కానీ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆ బలహీన క్షణంలో కన్నీళ్లు ఆగలేదు. ఇప్పుడు పూర్తిగా బాగున్నాను. స్వయం నిర్ణయాధికారానికి మద్దతుగా మాట్లాడినందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడం నిజంగా బాధాకరం” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన వెనుక నిలబడ్డ బలమైన మహిళల వల్లే తనకు అపారమైన ధైర్యం లభించిందని పేర్కొంది.

అదే జూమ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “ప్రెస్ మీట్‌కు ప్రత్యక్షంగా రావాలనుకున్నాను. కానీ అక్కడ చర్చ పక్కదారి పడుతుందని భావించి జూమ్ కాల్‌లో పాల్గొన్నాను. నా మాటలను కొంతమంది కావాలనే వక్రీకరిస్తున్నారు. నా వ్యక్తిగత విషయాలనే లక్ష్యంగా పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు. పద్ధతిగా చీర కట్టుకొని వచ్చిన రోజుకూడా ‘నీ నుదుటన సింధూరం ఎక్కడ?’ అంటూ ట్రోల్స్ చేశారు. నా జీవితంలో ఇంత స్థాయిలో విమర్శలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేనూ మనిషినే కదా… మీరు చేసిన డ్యామేజ్‌ను తిరిగి పూడ్చలేరు” అంటూ ఎమోషనల్ అయ్యింది.

“రెండేళ్లుగా మౌనంగా ఉన్నా… నేనేం మాట్లాడినా సరే నన్నే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేసింది.

మొత్తానికి అనసూయ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నవారు ఎవరు అనే దానిపై అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు.


Recent Random Post: