రీల్ జీవితానికి రియల్ జీవితానికి ఏ మాత్రం పోలిక ఉండదు. ఆన్ స్క్రీన్ మీద విలనిజాన్ని పండించడంలో తిరుగులేని నటుడు షాయాజీ షిండే. రీల్ లో ఎంత కర్కసత్వంగా వ్యవహరిస్తారో.. రియల్ లైఫ్ లో అందుకు భిన్నమైన ధోరణి ఆయన సొంతం. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు హాట్ చర్చకు దారి తీయటమే కాదు.. షాయాజీ షిండే వ్యాఖ్యలు వాస్తవరూపంలోకి తెస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఆయనేమన్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఎందుకు కోరుకుంటున్నారు? ఈ విషయం పవన్ కల్యాణ్ కు ఏ రీతిలో చేరుతుంది? ఆయన స్పందన ఏమిటి? లాంటి ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..
సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు ఈ సినిమా టీంలోని ముఖ్యులు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలక్షణ నటుడు షాయాజీ షిండేకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఖాళీ స్థలం కనిపిస్తే షాయాజీ చెట్లను నాటతారని చెప్పటంతో ఈ షో వ్యాఖ్యాత నాగార్జున ఆశ్చర్యపోయారు. అంతలా మొక్కలు ఎందుకు నాటుతున్నట్లు? అన్న విషయాన్ని అడిగి.. దానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో.. షాయాజీ ఓపెన్ అయ్యారు.
తన తల్లి 97 ఏళ్ల వయసులో కన్నుమూశారని.. ఆమె బతికి ఉన్నప్పుడు తన దగ్గర ఎంతో డబ్బున్నా.. దాంతో ఆమెను తానుబతికించుకోలేకపోయానని చెప్పారు. ఆమెను తాను బతికించుకోకపోవటంతో తానెంతో బాధ పడినట్లుగా పేర్కొన్నారు. ఆమెను బతికించుకోలేని నేను.. మా అమ్మగారి బరువుకు సమానమైన విత్తనాల్ని తీసుకొని దేశం మొత్తం నాటుతానని చెప్పినట్లుగా పేర్కొన్నారు. తాను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను.. పూలు.. పండ్లు ఇస్తాయని పేర్కొన్నారు. వాటిని చూసినప్పుడల్లా తన తల్లే గుర్తుకు వస్తుందన్నారు.
తన తల్లి తర్వాత తనకు భూమాతే అంతగా గుర్తుకు వస్తారన్నారు. సాధారణంగా ఆలయాలకు వెళితే ప్రసాదాలు ఇస్తారని.. ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇస్తే బాగుటుందన్న సూచన చేశారు. తనకు ఏపీ ఉప ముఖ్యమంత్రి కలసుకునేందుకు టైమిస్తే.. తాను ఈ విషయాన్ని ఆయనకు నేరుగా చెబుతానని చెప్పారు. భక్తులకు మొక్కను ఇస్తే.. వాటిని తీసుకెళ్లిన భక్తులు నాటుతారని.. అందులోనూ భగవంతుడ్ని చూడొచ్చన్నారు. మహారాష్ట్రలోని మూడు ఆలయాల్లో తానీ విధానాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు.
అయితే.. తాను మొక్కటు ఇస్తున్న మూడు ఆలయాల్లో ప్రతి ఒక్క భక్తుడికి ఇవ్వరని.. ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో.. వారికి ప్రసాదంలా మొక్కల్ని ఇస్తారన్నారు. ఇలా రోజుకు వంద.. రెండు వందల మందికి ఇస్తారన్నారు. తనకు ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే.. ఆయన్ను కలిసి ఈ విషయాన్ని చెబుతానని పేర్కొన్నారు. షాయాజీ షిండే చెప్పిన విషయాన్ని పవన్ కల్యాణ్ కు ఎలా చేరుతుందన్న ప్రశ్నకు.. నాగ్ స్పందిస్తూ ‘‘ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. వారే.. ఆయన వద్దకు ఆ విషయాన్ని తీసుకెళతారు’’ అని చెప్పటం ఆసక్తికరంగా మారింది. మరి.. పవన్ ఎప్పుడు రియాక్టు అవుతారో చూడాలి.
Recent Random Post: