తలైవర్ 173 డైరెక్టర్ ఎవరు?

Share


కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కనున్న తలైవర్ 173 ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు లెజెండరీ ఐకాన్లు ఒకే సినిమాకు కలిసి రావడం వల్ల హైప్ మరింత పెరిగిపోయింది.

మొదట ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా సిద్ధం అయ్యారన్న టాక్ వినిపించింది. కానీ రజినీ హీరోగా లోకేష్ తెరకెక్కించిన కూలీ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పరిస్థితులు మారాయి. లోకేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే సమాచారం బయటకు వచ్చింది.

ఆ తరవాత నెల్సన్ దిలీప్‌కుమార్ పేరు వినిపించింది. ప్రస్తుతం రజినీతో జైలర్ 2 చేస్తున్న ఆయన, తర్వాత కమల్–రజినీ కాంబో మూవీ చేయనున్నారని ప్రచారం జరిగింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఇంతలో సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడని అధికారికంగా ప్రకటించడంతో అందరూ సినిమా ట్రాక్‌లో పడిందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా సుందర్.సి ఈ ప్రాజెక్ట్‌ను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. అనుకోని పరిస్థితుల కారణంగా ఈ భారమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇంత పెద్ద అవకాశం కోల్పోతున్నా కూడా టీమ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఒక లేఖ ద్వారా తెలిపారు. దీంతో మరోసారి దర్శకుడి సీటు ఖాళీ అయ్యింది.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు కొత్తగా వినిపిస్తున్న పేరు కార్తీక్ సుబ్బరాజ్. ఆయన తెరకెక్కిస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రజినీతో పేట చిత్రాన్ని చేసిన కార్తీక్, పిజ్జా, జిగర్తాండ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఇటీవల వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. అయినప్పటికీ ఆయనకు తలైవర్ మరో అవకాశం ఇస్తే బెటర్ అని కామెంట్స్ వస్తున్నాయి.


Recent Random Post: