
ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కళా తపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్ జీవిత ఆధారంగా “విశ్వ దర్శనం” పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. జనార్ధన మహర్షి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
నేడు కే. విశ్వనాథ్ జయంతి సందర్భంగా నిర్మాణ సంస్థ దీనికి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో రాధికా శరత్‌కుమార్, భానుప్రియ, శైలజ, సుశీల, సీతారామ శాస్త్రి, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు కే. విశ్వనాథ్ గురించి మాట్లాడిన మాటలు చూడొచ్చు. ఈ గ్లింప్స్‌ను చూస్తే ఇది సినిమానా లేక డాక్యుమెంటరీనా? అనే సందేహం కలుగుతోంది.
విశ్వనాథ్‌గారిపై ఉన్న అభిమానంతో జనార్ధన మహర్షి ఈ చిత్రాన్ని 2019లోనే పూర్తి చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు విడుదల కాలేదు. అంటే, ఈ సినిమా విశ్వనాథ్ గారి హయాంలోనే రూపొందించబడింది, కానీ ఆయన ఇక మన మధ్య లేరు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జనార్ధన మహర్షి నిర్ణయించారు.
ఇప్పుడీ బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుంది. విశ్వనాథ్ జయంతి సందర్భంగా “విశ్వ దర్శనం” చిత్రాన్ని త్వరలో ఓటీటీలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “వెండితెర చెప్పిన బంగారు దర్శకుడి కథ” అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కళాతపస్వి జీవితం మరోసారి ప్రేక్షకులను అలరించనున్నదని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recent Random Post:















