దిగొస్తున్న స్టార్ హీరోలు.. సమస్య తీరేనా?


గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన సినిమా షూటింగ్ లు కూడా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలకు ఆగిన సినిమాల కారణంగా భారీ స్థాయిలో వడ్డీల భారం పడింది. ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి. దీంతో నిర్మాతలపై అదనపు భారం పడింది. అన్నీ భరించి సినిమాని పూర్తి చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకుడు థియేటర్లకు రాని పరిస్థితి.

దీనికి ఆజ్యం పోస్తూ టికెట్ రేట్లని పెంచేయడంతో ఆడియన్స్ థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. స్టార్ హీరోల సినిమా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. రెండు మూడు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తాయనే భావన ప్రేక్షకుల్లో నాటుకు పోవడంతో థియేటర్ల నుంచి రెండు మూడు వారాలకే సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

దీంతో నిర్మాతలు తీవ్ర స్థాయిలో నష్టాలని చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ లని అర్థాంతరంగా ఆపేసి సమస్య కొలిక్కి వచ్చాకే షూటింగ్ లని ప్రారంభించాని నిర్ణయించుకున్ననిర్మాతలు ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చారు.

మీడియం రేంజ్ సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు తీవ్ర నష్టాలని తెచ్చిపెడుతున్నాయి. బడ్జెట్ లపై నిర్మాతలు నియంత్రణ కోల్పోవడం స్టార్ల రెమ్యునరేషన్ లు ఆకాశాన్ని తాకుతుండటంతో ఇండస్ట్రీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేకంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో గిల్డ్ సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు.

ఇదిలా వుంటే ప్రొడ్యూసర్ లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని తాజాగా దిల్ రాజు స్టార్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ల దృష్టికి తీసుకెళ్లారట. ప్రస్తుతం ఇండస్ట్రీ బడ్జెట్ కంట్రోల్ చేయకపోతే నిలబడటం కష్టమని స్పష్టం చేశారట. స్టార్ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకుంటేనే సమస్య కొలిక్కి వస్తుందని ఇండస్ట్రీ మనగడ సాధ్యమవుతుందని స్పష్టం చేయడంతో ఈ స్టార్ హీరోలు సానుకూలంగా స్పందించి రెమ్యునరేషన్ లు తగ్గించుకుంటామని ముందుకొచ్చారని తెలిసింది.

టాలీవుడ్ లో క్రేజీ హీరోలైన ఈ ముగ్గురు పారితోషికాలు తగ్గుంచుకోవడానికి సుముఖతని వ్యక్తం చేయడంతో మిగతా హీరోలు కూడా ఇదే బాటపట్టే అవకాశం వుందని వీరి తరహాలోనే అంతా ఒక మాటపై నిలబడితే ఇండస్ట్రీ ప్రధాన సమస్య తీరినట్టేనని ప్రొడ్యూసర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్టార్ హీరోలతో చేస్తున్న చర్చలు ఫలిస్తుండటం విశేషం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తాజా పరిణామాలపై ఈ రోజు జరుగుతున్న మీటింగ్ లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం వుందని తెలిసింది.


Recent Random Post: