
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సినిమాల పరంగా అత్యంత బిజీగా ఉన్నాడు. ‘ది ప్యారడైజ్’ ప్రీ-ప్రొడక్షన్ పనులు, ‘కోర్ట్’ సినిమా రిలీజ్, అలాగే మెగాస్టార్ చిరంజీవితో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం వంటి విషయాలతో నాని తీరికలేని షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ‘హిట్ 3’ షూటింగ్‌ను పూర్తిచేసిన నాని, మే 1న ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నాడు.
ఇప్పటికే సినీవర్గాల్లో నాని – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ ప్రారంభంపై స్పష్టత రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు మరింత ఆలస్యం తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న ‘కుబేర’ సినిమా చివరి దశలో ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాతే శేఖర్ కమ్ముల – నాని ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయి దృష్టిపెడతారని సమాచారం.
నాని ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినప్పటికీ, స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికి మరికొంత సమయం పట్టనుంది. అందుకే ఈ సినిమా 2026కి వాయిదా పడే అవకాశముంది. మరోవైపు, నానికి ఇప్పటికే 2026లో ప్రారంభం కావాల్సిన రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. దీంతో శేఖర్ కమ్ముల సినిమాకు పూర్తి డేట్స్ కేటాయించడం కష్టతరమవుతుందని తెలుస్తోంది. అందువల్ల ప్రతినెల పదిరోజుల చొప్పున షూటింగ్ చేసేందుకు నాని అంగీకరించినట్టు టాక్. ఈ లాంగ్ షెడ్యూల్ కారణంగా సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పట్టే సూచనలున్నాయి.
ఈ సినిమాను ఆసియన్ సునీల్ నిర్మించనుండగా, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ తరహాలో శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సెన్సిబుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. కథ పరంగా ఎమోషన్, సంగీతం ప్రధానంగా ఉండేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
అభిమానులు ఈ కాంబినేషన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నాని సహజమైన నటనకు కేరాఫ్‌గా నిలిచిన నటుడైతే, శేఖర్ కమ్ముల తనదైన నెమ్మదైన కథనంతో ఆకట్టుకునే దర్శకుడు. ఈ ఇద్దరి కలయికలో ఓ ప్రత్యేకమైన కథ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, నాని త్వరలో ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్నాడు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే, నాని – సుజీత్ కాంబినేషన్లో మరో సినిమా కూడా లైన్లో ఉందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతమైతే, నాని కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
Recent Random Post:















