
నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తక్కువ వ్యవధిలోనే రెండు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా, రిలీజ్ ప్లాన్‌లో కీలక మార్పులు జరిగాయని వినిపిస్తోంది.
మొదట ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో దించాలని భావించినప్పటికీ, తాజా టాక్ ప్రకారం ఆ ఆలోచనను మార్చి ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. పండుగ సీజన్లో మాస్ సినిమాలకు ఉండే క్రేజ్, అలాగే బాలయ్య యాక్షన్ ఎంటర్టైనర్లకు దసరా సీజన్ బాగా సెట్ అవుతుందనే లెక్కలతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్‌ను వేగవంతం చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను సమాంతరంగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
గోపీచంద్ మలినేని–బాలయ్య కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ భారీ విజయాన్ని అందుకోవడంతో కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. ఈసారి కూడా పవర్ఫుల్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటాయని వినికిడి.
అదే సమయంలో 2027 సంక్రాంతిని కూడా బాలయ్య వదులుకోవడం లేదని సమాచారం. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో భారీ ప్రాజెక్ట్‌ను పొంగల్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా త్వరలో అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తి చేసిన తర్వాత హరీష్ శంకర్ బాలయ్య ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.
సంక్రాంతి సీజన్ నాగవంశీకి మంచి సెంటిమెంట్ కావడంతో 2027 పండుగను టార్గెట్ చేస్తూ భారీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలయ్య అభిమానులకు వరుస పండుగల వాతావరణం ఏర్పడినట్టే. ఈ ఏడాది దసరాకు ఒక సినిమా, ఆ తర్వాత సంక్రాంతికి మరో భారీ రిలీజ్ ఉంటే డబుల్ ఎంజాయ్మెంట్ ఖాయం. అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినిపిస్తున్న అప్డేట్స్తో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
Recent Random Post:















