ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్ సినిమాలకు ప్రత్యేకమైన హవా ఉండేది. భారీ బడ్జెట్, విస్తృత బిజినెస్, అద్భుతమైన వసూళ్లతో బాలీవుడ్ చిత్రాలు మిగతా ఇండస్ట్రీల సినిమాలకు అందనంత ఎత్తులో ఉండేవి. అప్పట్లో దక్షిణాది సినిమాలు ఉత్తరాదిలో పెద్దగా గుర్తింపు పొందేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సౌత్ సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో రికార్డులు బద్ధలు కొడుతుంటే, బాలీవుడ్ చిత్రాలు కాస్త వెనుకబడి పోతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఇటీవల ఒక వేడుకలో నటుడు ఆమీర్ ఖాన్కు ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. “ముక్కూ మొహం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఉత్తరాదిలో వందల కోట్ల వసూళ్లు రాబడుతుంటే, అదే సమయంలో బాలీవుడ్ చిత్రాలు వెనుకపడిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటి?” అని ఆమీర్‌ను ప్రశ్నించారు.
దీనికి స్పందించిన ఆమీర్, దక్షిణాది – ఉత్తరాది అనే భేదాలు అవసరం లేదని, సినిమా గ్లోబల్‌గా చూడాలని అభిప్రాయపడ్డాడు. అయితే, బాలీవుడ్ సినిమాల వెనుకబడటానికి ప్రధాన కారణంగా ఓటీటీ మాదిరి కొత్త వ్యాపార మోడల్స్‌ను పేర్కొన్నాడు.
“ఇప్పుడు థియేటర్‌కు వచ్చి మా సినిమా చూడండి అని ప్రేక్షకులను కోరాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, వారు 8 వారాల తర్వాత అదే సినిమాను ఇంట్లోనే చూడొచ్చని భావిస్తున్నారు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు పెద్దగా ఖర్చు చేయకుండా సినిమాను టీవీలో చూసేస్తున్నారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా విక్రయించాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
“ఓటీటీల రాకకు ముందుగా, ప్రేక్షకులు తప్పనిసరిగా థియేటర్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు, వారిని థియేటర్‌కి రప్పించాలంటే సినిమా వాళ్లకు మరింత కష్టమవుతోంది. బాలీవుడ్ దర్శకులు అధికంగా ప్రయోగాత్మకంగా వెళ్లి, మూలాలను మర్చిపోతున్నారన్న భావన కలుగుతోంది. మనం సినిమాల్లో ఎమోషన్లను మరింత బలంగా ప్రదర్శించాలి. జీవితంలోని వివిధ కోణాలను పట్టుకొని ప్రేక్షకులను థియేటర్‌కి ఆకర్షించేలా మన కథనాలను రూపొందించాలి,” అని ఆమీర్ వివరించాడు.
ఆమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందాలంటే, ఓటీటీ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recent Random Post: