బిగ్ బ్రేకింగ్… ఢిల్లీకి కొత్త సీఎంగా ఆతిశీ!

Share

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారసులు ఎవరు అంటూ గత రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఇందులో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా అనంతరం మంత్రి, ఆప్ నేత అతిశీ.. సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ప్రతిపాదించగా.. అంతా ఆమోదించారు!

అవును… ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేయనున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ వారసుడిని ఎంపిక చేసేందుకు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా… మంత్రి అతిశీ కి ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేందుకు ఆప్ లెజిస్లేటివ్ మీటింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశం అనంతరం సాయంత్రం 4:30 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అయితే ఆయన నేడే రాజీనామా చేసినప్పటికీ.. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం మాత్రం నేడు ఉండదని అంటున్నారు.

ఇందులో భాగంగా… అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ కావడానికి ముందే కొత్త సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని మాత్రం తెలుస్తోంది. కాగా… ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 26-27 తేదీల్లో జరగనున్నట్లు సమాచారం. అంటే ఆ లోపే ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేయనున్నారన్నమాట.

కాగా… ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్ 13న విడుదలైన సంగతి తెలిసిందే. అలా విడుదలైన రెండు రోజుల తర్వాత.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన ముందస్తు ఎన్నికలను కూడా కోరారు.

ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చేవరకూ తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనని ఈ సందర్భంగా కేజ్రీవాల్ శపథం చేశారు. నాటి నుంచి కేజ్రీవాల్ తన అధికారిక నివాసంలో తన వారసుడి గురించివరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు! ఈ సందర్భంగా ఈ విషయంలో నిర్ణయాధికారం రాజకీయ వ్యవహారాల కమిటీదని ఆయన తెలిపినట్లు చెబుతున్నారు!

2019 లోక్ సభ ఎన్న్నికల సమయంలో తూర్పు ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా అతిశీ నియమితులయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై ఆమె 4.77 లక్షల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఈ ఎన్నికలో సమీప బీజేపీ అభ్యర్థి ధరంభీర్ సింగ్ పై 11,422 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామాతో సౌరభ్ భరద్వాజ్ తో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో ఆమె క్యాబినెట్ మంత్రిగా చేరారు. ఈ నేపథ్యంలో త్వరలో సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు.


Recent Random Post:

వాణిజ్య ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోదీ | PM Modi Llikely to Meet Trump Next Month in US

August 13, 2025

Share

వాణిజ్య ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోదీ | PM Modi Llikely to Meet Trump Next Month in US