
హైకోర్టు ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ నాయకురాలు, ప్రముఖ యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడానికి కారణం ఏమిటి? ఎంత పారితోషికం అందుకున్నారు? వంటి అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ కేసులో మంగళవారం విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను మరోసారి విచారించారు. ఇప్పటివరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు లోతుగా విచారించగా, త్వరలో సన్నీ, అజయ్, సుధీర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, హర్ష సాయి, ఇమ్రాన్ మాత్రం ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం.
ఇక మియాపూర్ కేసులో పోలీసులు ప్రాధాన్యతను బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు, మధ్యవర్తులపై కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ గతంలో ఒకసారి యాప్ను ప్రోత్సహించినప్పటికీ, ఆ తర్వాత దానితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా, నటుడు విజయ్ దేవరకొండ కూడా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో యాంకర్ శ్యామల నేడు ఉదయం 8:44 గంటలకు తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆమెను పోలీసులు ప్రశ్నించగా, విచారణ అనంతరం మీడియాతో స్పందించారు.
“ప్రస్తుతం విచారణ జరుగుతోంది, దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మాట్లాడటం సరైనది కాదు. అయితే, పోలీసుల దర్యాప్తుకు నేను పూర్తిగా సహకరిస్తాను. చట్టం, న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయిన కుటుంబాలకు న్యాయం జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరం బాధ్యతగా వ్యవహరించాలి” అని శ్యామల పేర్కొన్నారు.
Recent Random Post:















