
న్యూయార్క్ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన మెట్ గాలా 2025 ఫ్యాషన్ ఈవెంట్‌లో భారతీయ సినీ తారలు అందంగా మెరిశారు. షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొని భారతీయ ఫ్యాషన్‌ను ప్రపంచానికి గర్వంగా చూపించారు.
అయితే ఈ వేడుకలో నిటారుగా నిలిచిన ఫిగర్ ఎవరో కాదు… ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. బాలీవుడ్ బ్యూటీలను మించిపోయే స్టైల్‌తో, అద్భుతమైన గ్లామర్‌తో ఇషా అంబానీ ఈవెంట్‌కి స్పెషల్ ఆకర్షణగా నిలిచారు. ఆమె ధరించిన వజ్రాల హారం, హాలీవుడ్ నటి అన్నా హత్వే “ఓషన్స్ 8” సినిమాలో ధరించిన లెజెండరీ కార్టియర్ నెక్లెస్‌ను గుర్తు చేస్తూ అందర్నీ మెస్మరైజ్ చేసింది.
ఇషా ధరించిన హారాన్ని చూసి, కొంతమంది అది అదే అని అనుకున్నారు. కానీ నిపుణులు పరిశీలించి, వజ్రాల పరిమాణం, సంఖ్యలో తేడాలు ఉన్నాయని గుర్తించారు. నిజానికి ఈ రెండు హారాలూ 1931లో నవానగర్ మహారాజా కోసం ఫ్రెంచ్ జ్యూవెలర్ జాక్వెస్ కార్టియర్ రూపొందించిన ఓ ఐకానిక్ హారం నుండి ప్రేరణ పొందినవే. ఆ అసలు హారం 1960 వరకు రాజ కుటుంబం వద్ద ఉండి, తర్వాత కార్టియర్ సంస్థద్వారా తిరిగి సేకరించబడింది. ఆ తర్వాత దానిలోని వజ్రాలను విడిగా కట్ చేసి, వేర్వేరు వేలాల్లో అమ్మారు. అందుకే అసలు రూపాన్ని అది కోల్పోయింది.
“ఓషన్స్ 8” సినిమాకోసం కార్టియర్ ఆర్కైవ్ ఫోటోలను ఆధారంగా తీసుకుని ఆ హారాన్ని తిరిగి రూపొందించారు. ఒరిజినల్ హారం మగవారి కోసం కావడంతో, దానిని 20% తక్కువ పరిమాణంతో మళ్లీ రూపొందించి, నటి అన్నా హత్వేకి వేసారు. ఈ హారం విలువ సుమారు 150 మిలియన్ అమెరికన్ డాలర్లు అని అంచనా.
ఇషా అంబానీ ధరించిన నెక్లెస్ వాస్తవానికి తన తల్లి నీతా అంబానీకి చెందినదని ఆమె స్వయంగా వెల్లడించారు. రాయల్ కార్టియర్ డిజైన్‌కి ప్రేరణగా తీసుకుని, అంబానీ కుటుంబం ప్రత్యేకంగా కస్టమ్ డిజైన్ చేయించిందని తెలుస్తోంది.
ఈ ఏడాది మెట్ గాలాలో ఇషా ఐదోసారి పాల్గొన్నారు. ఆమె ధరించిన డిజైనర్ దుస్తులు అనామిక ఖన్నా రూపొందించగా, లుక్ స్టైలింగ్‌ను అనైతా ష్రాఫ్ అడజానియా నిర్వహించారు.
Recent Random Post:















