మోక్షజ్ఞ డెబ్యూ ఫిక్స్.. ‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో ఎంట్రీ!

Share


నందమూరి కుటుంబానికి చెందిన మరో వారసుడు, సీనియర్ హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. ‘ఇప్పుడే వస్తాడు.. అప్పుడే వస్తాడు’ అంటూ నెలలు గడిచిపోయినా, మోక్షు బాబు నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఆపై ఆగిపోయింది.

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్టే అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. దీంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తాజా బజ్ ప్రకారం.. మోక్షజ్ఞ తొలి చిత్రం టాలీవుడ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా తెరకెక్కనుందట. ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు వినికిడి.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో అప్పట్లో సంచలనం సృష్టించిన ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా మోక్షజ్ఞ డెబ్యూ అంటే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వర్క్‌ను కూడా పూర్తిచేశారట. పీరియాడిక్, ఫాంటసీ కథల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్, మోక్షజ్ఞను పవర్‌ఫుల్‌గా పరిచయం చేసేలా కథను సిద్ధం చేశారని టాక్.

మరికొద్ది రోజుల్లో పూజా కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. అనంతరం మార్చి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మోక్షజ్ఞతో పాటు అనుభవం ఉన్న నటీనటులకు కూడా కీలక పాత్రలు ఉంటాయని సమాచారం. కథకు తగ్గట్టుగా ప్రతి పాత్రను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారట.

మోక్షజ్ఞ లుక్ విషయంలోనూ దర్శకుడు క్రిష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వినికిడి. స్టైలిష్‌, మోడ్రన్‌గా చూపించడమే కాకుండా, బాలయ్య వారసుడిగా ఆయనలోని పవర్ స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేస్తున్నారట. తొలి సినిమాతోనే మోక్షజ్ఞకు స్ట్రాంగ్ ఇమేజ్ తీసుకురావడమే లక్ష్యంగా టీమ్ వర్క్ చేస్తోందని టాక్. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారని సమాచారం.


Recent Random Post: