
తెలుగు సినిమా చరిత్రలో రాముడి రూపం అంటే ముందుగా గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. కృష్ణుడిగా అపారమైన ప్రజాదరణ సంపాదించినా, లవకుశలో ఆయన చూపించిన రాముని దివ్యత్వం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత ఎవ్వరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఎన్టీఆర్ ప్రభావం కొనసాగింది. ఎన్టీఆర్ తరువాత అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా రాముడి పాత్రకు కోరినా ఆయన ఒప్పుకోకపోవడం అదే ప్రభావానికి సూచిక. తదుపరి బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు గారి రాముడి రూపం ప్రజలను ఆకట్టుకుని మరోసారి ఆ పాత్రకు గౌరవం తీసుకువచ్చింది.
అలాంటి క్లిష్టమైన బాధ్యతను ఇప్పుడు దశాబ్దాల తరువాత తీసుకున్నది ఎస్.ఎస్. రాజమౌళి. తన కొత్త ప్రాజెక్ట్‌లో రాముడిగా మహేష్ బాబును చూపించబోతున్నట్లు వెల్లడించిన జక్కన్న, ఒక కీలక ఎపిసోడ్ ఫోటోషూట్ సమయంలో మహేష్ రూపాన్ని వాల్‌పేపర్‌గా పెట్టుకొని చివరికి “ఎవరైనా చూడబోతారేమో” అని డిలీట్ చేశానని చెప్పుకొచ్చారు. మహేష్ బాబును రాముడి రూపంలో చూసినప్పుడు తానే గూస్‌బంప్స్‌కి గురయ్యానని రాజమౌళి చెప్పడం, ఆయన మీద ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు ‘కొంటె కృష్ణుడు’గా ముద్ర వేసుకున్న మహేష్, సౌమ్యుడైన రాముడిగా ఎలా ఉంటాడో అన్న సందేహాలను పూర్తిగా తొలగించే స్థాయిలో నటిస్తున్నాడని రాజమౌళి ఇచ్చిన సంకేతాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి.
రాజమౌళి మరియు విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలను కలిపి చూస్తే—మహేష్ బాబు తన విశ్వరూపాన్ని చూపబోయే పాత్ర ఇదేనేమో అన్న ఆశలు పెరుగుతున్నాయి. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్రలో నటించినా, చిత్ర రూపకల్పన పరంగా వచ్చిన విమర్శలు ఆయన లుక్‌పై కూడా మిశ్రమ స్పందనకు దారితీశాయి. కానీ మహేష్ బాబును హ్యాండిల్ చేయబోతున్నది రాజమౌళి కాబట్టి, అంచనాలను మించి అవుట్‌పుట్ ఇవ్వడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఒక్క సమస్య—ఈ మహత్తర విజన్‌ను తెరపై చూడాలంటే ప్రేక్షకులు మాత్రం ఇంకా కొంతకాలం ఓర్పుతో వేచి ఉండాలి.
Recent Random Post:














