రామ్ చరణ్ RC16పై భారీ అంచనాలు – ధోనీ గెస్ట్ రోల్ క్లారిటీ!

Share


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తుండగా, ఈ సినిమా RC16 పేరిట భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ‘రంగస్థలం’ తర్వాత మళ్లీ చరణ్ మాస్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథను ఎంచుకోవడం, దీనికి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉండటం ఆసక్తిని పెంచింది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, దివ్యేందు, శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేయనున్నాడని వార్తలు హల్‌చల్ చేశాయి. కొన్ని కథనాల్లో ధోనీ రామ్ చరణ్ కోచ్‌గా కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. నిజానికి, ధోనీ, రామ్ చరణ్ మంచి స్నేహితులు కాగా, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చరణ్‌ను కలుస్తుంటాడు. ఈ నేపథ్యంలో RC16లో అతడు ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. సినిమాలో కోచ్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ, ఆ పాత్రను ధోనీ పోషించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు ధోనీ సినిమాల్లో నటించకపోయినా, నిర్మాణంలో మాత్రం ఆసక్తి చూపిస్తున్నాడు.

RC16 షూటింగ్ జనవరిలో ముంబైలో ప్రారంభమై, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. బుచ్చిబాబు కథను సహజత్వానికి దగ్గరగా తీర్చిదిద్దేందుకు అవుట్‌డోర్ లొకేషన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ పాత్ర ఎమోషనల్‌గా, పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఉండబోతోందని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం మీద రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

ధోనీ గెస్ట్ రోల్ వార్తలు నిజం కాకపోయినా, RC16పై ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. మరిన్ని అధికారిక అప్డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Recent Random Post: