
చిన్న వయసులోనే ఇంటిని వదిలి ముంబైకి వెళ్లిపోయానని క్వీన్ కంగనా రనౌత్ బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. సినీ రంగంలో అడుగుపెట్టే చాలా మంది కళాకారులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటారు. కానీ ఈ నిజాన్ని బయటపెట్టేవారు మాత్రం చాలా కొద్ది మంది. ఇంట్లో అనుమతి లేకుండా స్టార్ అవ్వాలనే కలలతో బయలుదేరతారు. అయితే ఆ కలలు నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఈ రంగంలో సక్సెస్ అయ్యేది కేవలం కొద్ది శాతం మంది మాత్రమే. అయితే ఓటీటీ వేదికల రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతిభావంతులైన కళాకారులకు అవకాశాలు పెరిగినా, వాటిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం చాలామందికి కష్టంగా మారింది.
ఇలాంటి పరిస్థితినే నటుడు విజయ్ వర్మ కూడా ఎదుర్కొన్నాడు. తాను ఇంటి నుంచి పారిపోయిన తర్వాత కలిగిన అపరాధభావన వల్ల తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యానని ఆయన ఇటీవల వెల్లడించాడు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఒంటరిగా ఉండడం ఆ పరిస్థితిని మరింత తీవ్రం చేసిందని చెప్పారు. తాను నివసించే అపార్ట్మెంట్ టెర్రస్‌కి వెళ్లి ఆకాశాన్ని చూసినప్పుడే కొంత ఉపశమనం కలిగిందని పేర్కొన్నాడు. ఆ కష్టసమయంలో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తనకు ఎంతో మానసిక బలాన్నిచ్చిందని విజయ్ వర్మ తెలిపారు.
‘దహద్’ షూటింగ్ సమయంలో ఇరా ఖాన్, గుల్షన్ దేవయ్య తనకు మానసికంగా సహాయం చేశారని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు ఇరా, డిప్రెషన్‌కి చికిత్స తీసుకోవాలని సూచించగా, కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా తాను మెల్లగా కోలుకున్నానని చెప్పాడు. ‘‘ఇంటి నుంచి పారిపోయినందుకు నాలో ఉన్న అపరాధభావన చాలా లోతుగా నాటుకుపోయింది. యోగా చేయడం ప్రారంభించాక కొంత శాంతి దొరికింది. కానీ యోగా మ్యాట్ మీద పడి సూర్య నమస్కారం చేయాలన్నా కుదరేది కాదు. కన్నీళ్లు ఆగేవి కావు’’ అని విజయ్ వర్మ చెప్పాడు.
అంతే కాకుండా, ‘‘చిన్నప్పుడు మనం అనుభవించిన బాధలు మన మస్తిష్కంలో బలంగా మిగిలిపోతాయి. వాటిని ఎదుర్కొని బయటపడకపోతే జీవితాంతం వెంటాడుతాయి. నా జీవితం నాకు సరైనదే అనిపించినా, నా కుటుంబానికి అది నొప్పి కలిగించింది’’ అని ఆయన మనసులోని నిజాన్ని వెల్లడించాడు. రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్‌లో తన డిప్రెషన్ అనుభవాలను నిజాయితీగా పంచుకున్న విజయ్ వర్మ, చివర్లో ‘‘ఇరా ఖాన్, గుల్షన్ దేవయ్య నాకు అండగా నిలిచారు. వారివల్లనే నేను తిరిగి వెలుగులోకి వచ్చాను’’ అని కృతజ్ఞతలు తెలిపారు.
Recent Random Post:














