సందీప్ కిషన్ హీరోగా కృష్ణ చైతన్య డ్రీమ్ ప్రాజెక్ట్ పవర్ పేట

Share


టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన దర్శకులలో కృష్ణ చైతన్య పేరు ముందుంటుంది. పాటల రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టి అనేక సూపర్ హిట్ పాటలు అందించిన ఆయన, రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడిగా మారి తన టాలెంట్‌కి మంచి మార్కులు తెచ్చుకున్నారు. నారా రోహిత్ హీరోగా వచ్చిన ఆ సినిమా ఆయన మేకింగ్, డైలాగ్స్‌తో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ఆ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకుని నితిన్ – మేఘా ఆకాష్ లీడ్ రోల్స్‌లో చల్ మోహన్ రంగ సినిమాను తీశారు. తాజాగా, గత ఏడాది విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గోదావరి ప్రాంతాన్ని కొత్త కోణంలో చూపించి తనదైన శైలిలో కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

అతని టాలెంట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఫిదా అవ్వడంతో, టాలీవుడ్ యువ హీరోలు ఆయనతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలాకాలంగా చర్చలో ఉన్న ‘పవర్ పేట’ ప్రాజెక్ట్‌ గురించి మళ్లీ హాట్ టాపిక్‌ మొదలైంది. మొదట ఈ సినిమా నితిన్‌తో ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.

తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ పవర్ పేట సినిమాలో హీరోగా సందీప్ కిషన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాత్ర, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలు నిర్మించిన 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ను నిర్మించనుంది.

ముందుగా పవర్ పేటను రెండు పార్టులుగా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తాజా ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఒకే పార్ట్‌గా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఏలూరు బ్యాక్‌డ్రాప్లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుందని టాక్.

కృష్ణ చైతన్యకి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పాటు, సందీప్ కిషన్ కి కూడా హిట్ చాలా అవసరం. ఇద్దరూ ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారని చెప్పాలి. సందీప్ తన యాక్టింగ్‌తో, కృష్ణ చైతన్య తన టేకింగ్‌తో ఆకట్టుకుంటే ఈ సినిమా ఇద్దరికీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ కానుంది.


Recent Random Post: