సితార బ్యానర్‌లో నాని మళ్లీ!

Share


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగంగా ఆకట్టుకుంది. సాధారణంగా విజేతల గురించే మాట్లాడే సినీ ప్రపంచంలో, ఓడిపోయిన వ్యక్తి కథను తీసుకుని సక్సెస్ సాధించడం గౌతమ్‌కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే సమయంలో సితార బ్యానర్‌కు కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే జెర్సీ తర్వాత నాని, సితార బ్యానర్‌లో మళ్లీ సినిమా చేయలేదు.

ఇప్పుడు తాజాగా సితార అధినేత సూర్యదేవర నాగ వంశీ, నానితో మరో సినిమా ఉంటుందని అధికారికంగా రివీల్ చేశారు. ఈ సినిమా 2026 రెండో భాగంలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. దర్శకుడు, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

నాని–సితార కాంబినేషన్ అంటే సహజంగానే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేరు ముందుగా వినిపిస్తోంది. అయితే గౌతమ్‌తోనే సితార బ్యానర్‌లో కింగ్‌డమ్ సినిమా చేసిన నాగ వంశీకి ఆ ప్రాజెక్ట్ కమర్షియల్‌గా కలిసి రాలేదు. అందుకే ఈసారి వేరే దర్శకుడిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది.

ఈ క్రమంలో హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్‌తో నాని సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శౌర్యువ్‌కు తొలి అవకాశం ఇచ్చిన నాని, అతనితో రెండో సినిమా చేయాలనుకుంటున్నాడన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు, సితార బ్యానర్‌కు ఆస్థాన దర్శకుడిగా పేరున్న వెంకీ అట్లూరితోనూ నాని సినిమా ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్‌లో తెరకెక్కిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్యతో సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక నానితో సినిమా మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వెంకీ–నాని కాంబినేషన్ ఖచ్చితంగా స్పెషల్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక నాగ వంశీ మాట్లాడుతూ, వచ్చే ఏడాది తమ బ్యానర్ నుంచి పలు భారీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక సుజీత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ఇప్పటికే ఫిక్స్ అయిందని సమాచారం. ఆ సినిమా చేస్తూనే సితార బ్యానర్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే నాని–సితార కాంబినేషన్‌లో దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వరుస విజయాలతో నాని సినిమా అంటేనే పక్కా హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. రాబోయే ది ప్యారడైజ్, సుజీత్ సినిమాలు కూడా అదే విజయ ఫామ్ కొనసాగిస్తాయని అంచనాలు ఉన్నాయి.

ఇక సితార నాగ వంశీ అక్కినేని నాగ చైతన్యతో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ బ్యానర్ నాగ చైతన్య సినిమాతోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత చైతన్యతో మరో సినిమా త్వరలోనే అనౌన్స్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.


Recent Random Post: