
విడాముయర్చి… తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం, తెలుగులో “పట్టుదల” పేరుతో విడుదలైంది. ఈ రోజు రెండు భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా అసలు సంక్రాంతికి రావాల్సింది. కానీ, హాలీవుడ్ మూవీ “బ్రేక్‌డౌన్”కు ఇది ఫ్రీమేక్ అని గుర్తించడంతో, హాలీవుడ్ నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. ఈ వివాదం కారణంగా విడుదల వాయిదా పడింది. చివరికి ఇరు వర్గాల మధ్య ఏదో సెటిల్మెంట్ జరిగినట్టుంది, దీంతో అజిత్ అభిమానుల నిరీక్షణకు ముగింపు పలికింది.
అయితే, ఎన్నో అంచనాలతో థియేటర్లకు చేరుకున్న అజిత్ ఫ్యాన్స్‌కు సినిమా చూసాక పెద్ద షాకే తగిలింది. చిన్న, మిడ్-రేంజ్ సినిమాలు తీసే మగిల్ తిరుమణికి అజిత్ ప్రత్యేకంగా ఛాన్స్ ఇచ్చినప్పటికీ, ఈ అవకాశాన్ని పూర్తిగా వృథా చేశాడు. 28 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి, కొత్తదనం లేకుండా ఓ మామూలు థ్రిల్లర్‌ను అందించాడు.
“బ్రేక్‌డౌన్” అప్పట్లో గొప్ప థ్రిల్లర్‌గా ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు చూస్తే అది చాలా సాధారణంగా అనిపిస్తోంది. మగిల్ ఈ కథకు మినిమమ్ ట్రెండీ స్క్రీన్‌ప్లే కూడా కలిపేందుకు ప్రయత్నించలేదు. మలయాళం నుంచి అద్భుతమైన థ్రిల్లర్లు ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ప్రస్తుత రోజుల్లో, ఇలాంటి ఫ్లాట్ థ్రిల్లర్లు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చెప్పలేం.
రెండున్నర గంటల నిడివితో సాగిన ఈ సినిమాలో హై మూమెంట్స్ ఏమీ లేకపోవడం, మాస్ సినిమాల్లో ఫ్యాన్స్‌ను మెప్పించే ఎలిమెంట్స్ కూడా లేకపోవడంతో, అజిత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ముందే అర్థం చేసుకున్నాడంటూ ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఎందుకంటే, అనిరుధ్ తాను పని చేసిన పెద్ద సినిమాలకు రిలీజ్ ముందు సోషల్ మీడియాలో ఫైర్ ఎమోజీ రివ్యూలు ఇస్తుంటాడు. అవి చూసి ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ అవుతారు. కానీ “విడాముయర్చి”కి ఆయన అలాంటి పోస్టే పెట్టకపోవడంతో సినిమా గురించి ముందే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Recent Random Post:















