
చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సులక్షణ పండిట్ గురువారం తుది శ్వాస విడిచారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మార్గమధ్యంలో మరణించినట్లు ఆమె సోదరుడు లలిత్ పండిట్ తెలిపారు. ప్రస్తుతం సులక్షణ పండిట్ వయస్సు 71 సంవత్సరాలు. గుండెపోటుతో ఆమె మృతి చెందడాన్ని అభిమానులు తీవ్ర విచారంతో స్వీకరిస్తున్నారు.
1970–80 దశకాల్లో సులక్షణ పండిట్ హిందీ చిత్రసీమలో అగ్రస్థానంలో నిలిచారు. జితేంద్ర, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, శశి కపూర్ వంటి అగ్రహీరోల సరసన నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నటనతో పాటు గాత్రంలోనూ ప్రతిభ చాటుతూ అనేక పాటలు పాడి సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు.
తన సొంత ప్రతిభతో బోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేయకపోవడం వల్ల ఒక దశలో ‘దురదృష్టవంతురాలు’గా మారినట్లు పలువురు పేర్కొంటారు.
సులక్షణ పండిట్ వ్యక్తిగత జీవితం కూడా సినిమాలా నాటకీయంగా సాగింది. తన తొలి చిత్రం ఉల్జాన్ షూటింగ్ సమయంలోనే ఒక ప్రముఖ హీరోను మనసారా ప్రేమించారు. ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని గాఢంగా కోరుకున్నారు. అయితే ఆ హీరో అప్పటికే మరో నాయికను ప్రేమించడమే కాకుండా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రేమ విఫలమవడంతో ఆ హీరో జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోయారు.
ఆ హీరోతో జీవితాన్ని గడపాలనే సులక్షణ కోరిక నెరవేరకపోవడంతో ఆమె కూడా ఎవరినీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. 1985లో ఆ హీరో గుండెపోటుతో 47 ఏళ్ల వయసులో కన్నుమూయగా, సులక్షణ పండిట్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని ఆమె సోదరి విజేత పండిట్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు
డిప్రెషన్‌తో బాధపడుతున్న సులక్షణను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చినప్పటికీ, ఆమె తిరిగి సాధారణ జీవితంలోకి రాలేకపోయారు. కాలం గడిచేకొద్దీ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఒకసారి బాత్రూంలో జారి పడి నాలుగు సర్జరీలు చేయించుకున్నప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడలేదు. నడవలేని స్థితిలో జీవితాన్ని గడిపిన ఆమె చివరికి గుండెపోటుతో కన్నుమూశారు.
డిప్రెషన్‌తో బాధపడుతున్న సులక్షణను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చినప్పటికీ, ఆమె తిరిగి సాధారణ జీవితంలోకి రాలేకపోయారు. కాలం గడిచేకొద్దీ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఒకసారి బాత్రూంలో జారి పడి నాలుగు సర్జరీలు చేయించుకున్నప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడలేదు. నడవలేని స్థితిలో జీవితాన్ని గడిపిన ఆమె చివరికి గుండెపోటుతో కన్నుమూశారు.
సినీ, సంగీత రంగాలకు ఎంతో సేవలందించిన సులక్షణ పండిట్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Recent Random Post:















