హారర్, ఎమోషన్ మేళవింపు – రెండు సినిమాలు రంగంలోకి

Share


థియేటర్లలో పబ్లిక్ రాక తక్కువగా ఉండటం వల్ల బయ్యర్లు “అలో లక్ష్మణా!” అంటూ చేతులు పైకెత్తే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో నుండి ఊరట కలిగించేలా ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో మొదటిది ‘ఓదెల 2’, ఒక రోజు ముందుగానే రేపు గురువారం థియేటర్లలో విడుదల కాబోతోంది. తమన్నా, సంపత్ నంది ఆగకుండా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నారు. ట్రేడ్ వర్గాల్లో సినిమాకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, జనసామాన్యంలో స్పందన ఎలా ఉంటుందన్నది రేపటి మార్నింగ్ షోతో తేలనుంది. మాట ప్రాకారం మంచి పాజిటివ్ టాక్ వచ్చిందంటే, ఇది మా ఊరి పొలిమేర 2, విరూపాక్ష తరహాలో ప్రేక్షకుల ఆదరణతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

కథ విషయానికొస్తే, చనిపోయిన మనిషి ఆత్మ తిరిగి ఊళ్లోకి వచ్చి అల్లరి చేస్తే, శివశక్తిగా మారిన ఓ మహిళ ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొందిందన్న థీమ్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.

ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో హీరో కళ్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకం చాలా బలమైనది. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఈవెంట్‌కు హాజరై, చిత్రాన్ని మెచ్చుకోవడంతో పాటు మద్దతు తెలపడం ఓపెనింగ్స్ పరంగా సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా విజయశాంతి పోషించిన తల్లి పాత్రను చిత్ర బృందం బాగా హైలైట్ చేస్తోంది. చివరి 15 నిమిషాల్లో ఎమోషనల్ క్లైమాక్స్ బాగా కదిలిస్తుందని, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

రెండు సినిమాలూ తమదైన బలాలూ, బలహీనతలూ కలిగి ఉన్నాయి. ఓదెల 2 ట్రైలర్‌ లో హారర్ ఎలిమెంట్స్ ‘అరుంధతి’ స్టైల్‌లో కనిపించినా, వాటిని కథలో ఎలా జస్టిఫై చేశారన్నదే సినిమా సక్సెస్‌ను నిర్ణయించనుంది. తమన్నా ఇమేజ్ కూడా సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుంది.

మరోవైపు, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో తల్లి భావోద్వేగం ప్రధాన ఆకర్షణైనా, ఇది బేసిక్గా కమర్షియల్ ఎంటర్‌టైనరే. కథ పరంగా కొత్తదనం లేకపోయినా, సగటు ప్రేక్షకుడిని రెండున్నర గంటలు ఎంగేజ్ చేయగలిగితే పటాస్ తరహాలో మరో హిట్ కళ్యాణ్ రామ్ ఖాతాలో పడే ఛాన్స్ ఉంది.

అన్నట్టు, పోటీలో ఉన్న ఈ ఇద్దరూ—తమన్నా, కళ్యాణ్ రామ్—ఏడేళ్ల క్రితం ‘నా నువ్వే’ అనే చిత్రంలో జంటగా నటించిన విషయం మర్చిపోకూడదు. ఆ కలయిక ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రెండోసారి ఢీ కొట్టడం విశేషం!


Recent Random Post: