
నందమూరి బాలకృష్ణ త్వరలో ‘అఖండ: 2 తాండవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మూడున్నరేళ్ల క్రితం విడుదలైన ‘అఖండ’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ నాలుగోసారి కలిసి ‘అఖండ 2’ రూపంలో మరో సెన్సేషనల్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీలోనే కాదు, అభిమానుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య, సినిమాల్లోనూ వరుసగా హిట్లు అందుకుంటూ జోరు కొనసాగిస్తున్నారు.
ఈ సంవత్సరం ఆరంభంలో విడుదలైన ‘డాకు మహారాజ్’తో బాలయ్య ప్రేక్షకులను అలరించారు. కలెక్షన్ల పరంగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఆ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ‘అఖండ 2’ పై ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ అంచనాలకు తగ్గట్టుగా బోయపాటి శ్రీను దాదాపు ఏడాది పాటు సమయం కేటాయించి సినిమాను శ్రమతో తీర్చిదిద్దారు.
సెప్టెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ, “బోయపాటి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆయన మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు,” అన్నారు.
తాజాగా జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, అక్కడ -4 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో షూటింగ్ చేసిన అనుభవాన్ని బాలయ్య వివరించారు. “అంత చలిలో యూనిట్ సభ్యులు తట్టుకోలేక పోయారు. కానీ నేను మాత్రం శివుని ఆశీస్సులతో స్ట్రాంగ్‌గా షూట్ చేశాను. చలిని తట్టుకుని యాక్షన్ సన్నివేశాలు చేశాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవల విడుదలైన టీజర్లో జార్జియాలో చిత్రీకరించిన మంచు సన్నివేశాలు చూపించగా, ఆ విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యువ హీరోలు కూడా అలాంటి చలిలో నటించడానికి వెనుకాడే పరిస్థితుల్లో బాలయ్య అద్భుతంగా యాక్షన్ సీన్లు చేయడం అభినందనీయమని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
శివుని ఆశీస్సులతో సినిమా అద్భుతంగా పూర్తి చేసినట్టు బాలయ్య చెప్పారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌తో పాటు మరికొంతమంది కథానాయికలు నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం.
Recent Random Post:














