
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా ఏ దర్శకుడితో చేయనున్నాడనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. త్రివిక్రమ్ తో ముందుగా సినిమా చేయనున్నాడా, లేక అట్లీతో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నాడా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, అట్లీ డైరెక్షన్ లోనే బన్నీ కొత్త సినిమా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2026లో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నప్పటికీ, ముందుగా అట్లీ మూవీనే సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ను తీసుకురావాలని అట్లీ భావించాడట. అయితే, విల్ స్మిత్ పారితోషికం భారీగా ఉండటంతో ఆ ఐడియా విరమించుకున్నట్లు తెలుస్తోంది. అట్లీ సినిమాలు పూర్తిగా కమర్షియల్ మాస్ మసాలా ఫార్ములాతో రూపొందుతుంటాయి. కథలు ఎక్కువగా కొత్తదనం లేకుండా, హీరో స్టార్డమ్ ను హైలైట్ చేసే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, అంతటి స్థాయి హాలీవుడ్ స్టార్ అలాంటి కమర్షియల్ స్క్రిప్ట్ ను ఒప్పుకుంటాడా అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న.
ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే జాన్వీ తెలుగులో అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో అవకాశం వస్తే, ఆమె ఖచ్చితంగా అంగీకరిస్తుందనే విశ్వాసం ఉంది. అయితే, ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్ల పాత్రలు ఉంటాయని, మరింత గ్రాండ్ విజువల్స్ అందించేందుకు స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. మొత్తం 600 కోట్ల బడ్జెట్ పై ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇందులో కేవలం అల్లు అర్జున్, అట్లీ పారితోషికంగానే 100 కోట్ల వరకు వెచ్చించనున్నారని టాక్. మిగతా మొత్తం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, గ్రాండ్ స్టార్కాస్ట్ కోసం కేటాయిస్తారని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ నిర్మించనుంది.
ఇప్పటికే అల్లు అర్జున్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కావాలని ప్రయత్నించినా, ఆ అవకాశం దక్కలేదని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా, అట్లీ – బన్నీ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Recent Random Post:














