అవ‌తార్ ద‌ర్శ‌కుడు కామెరూన్ మ‌రో సంచ‌లనం

టైటానిక్, టెర్మినేట‌ర్ 2, అవ‌తార్, అవ‌తార్ 2 లాంటి సంచ‌ల‌న చిత్రాల‌ను తెర‌కెక్కించారు జేమ్స్ కామెరూన్. త‌దుప‌రి అవ‌తార్ సిరీస్ లో వ‌రుస‌గా చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. అవ‌తార్ 3 చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉంది. ఇంత‌లోనే ఇప్పుడు కామెరూన్ నుంచి వ‌చ్చిన ప్ర‌క‌ట‌న ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈసారి అత‌డు జ‌పాన్ పై అణుబాంబ్ దాడి ప‌ర్య‌వ‌సానాల‌పై సినిమా తీస్తూ వార్త‌ల్లోకొచ్చారు.

జేమ్స్ కామెరాన్ త్వ‌ర‌లో మార్కెట్లోకి రానున్న‌ `ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా` పుస్త‌కం హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. అణు బాంబు గురించి చార్లెస్ పెల్లెగ్రినో రాసిన ఈ పుస్తకం బ్లాక్‌స్టోన్ పబ్లిషింగ్ ద్వారా వచ్చే ఏడాది (2025) ఆగస్టులో విడుదల కానుంది. సినిమాగా రూపొందించేందుకు ఈ పుస్త‌కాన్ని కామెరూన్ కొనుగోలు చేసార‌ని స‌మాచారం. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌లో అణు బాంబు దాడుల నుండి బయటపడిన ఒంటరి వ్యక్తిగా పాపుల‌రైన‌ ఇంజనీర్ సుటోము యమగుచి నిజమైన కథను ఈ పుస్త‌కంలో రాసారు. దీని ఆధారంగా కామెరూన్ సినిమా తీయ‌నున్నారు.

జ‌పాన్ పై అమెరికా అణుబాంబుల‌తో దాడి చేయ‌గా హిరోషిమా, నాగ‌సాకి న‌గ‌రాల నుంచి సుమారు 100,000 నుండి 200,000 మంది మరణించినట్లు క‌థ‌నాలొచ్చాయి. బాంబు దాడుల స‌మ‌యంలో యమగుచి అనే ఇంజినీర్ స‌మ‌స్యాత్మ‌క‌మైన న‌గ‌రాలు హిరోషిమా- నాగసాకిలను సందర్శిస్తున్నారు. అమెరికా బాంబ్ దాడుల్లో మ‌ర‌ణించ‌కుండా అత‌డు ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు అత‌డి ఆస‌క్తిక‌ర క‌థ‌ను సినిమాగా తీసేందుకు కామెరూన్ ప్ర‌య‌త్నిస్తున్నారు. 1997లో లియోనార్డో డికాప్రియో- కేట్ విన్స్‌లెట్ ప్ర‌ధాన తారాగ‌ణంగా `టైటానిక్`ని తెర‌కెక్కించిన‌ తర్వాత అవతార్ ఫ్రాంచైజీలో భాగం కాని కామెరాన్ మొదటి సినిమాగా ఇది రికార్డుల‌కెక్క‌నుంది.

అత‌డు రూపొందించిన‌ `అవతార్: ఫైర్ అండ్ యాష్` (అవ‌తార్ 3) 19 డిసెంబర్ 2025న థియేటర్లలోకి రానుంది. ఫ్రాంచైజీలో మూడో చిత్రాన్ని రెండోది అయిన‌ `అవతార్: ది వే ఆఫ్ వాటర్‌`తో ఏకకాలంలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. అవతార్ ఫ్రాంచైజీలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి దర్శకుడిగా తన ప్రమేయాన్ని కామెరాన్ ఇంకా ధృవీకరించలేదు. అవతార్ సిరీస్‌లో తన కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత కామెరాన్ `ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా`ను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాలు చేస్తారు. అణుబాంబ్ ని క‌నిపెట్టిన అమెరిక‌న్ పితామ‌హుడిపై క్రిస్టోఫ‌ర్ నోలాన్ `ఓపెన్ హైమ‌ర్` అనే సినిమాని తెర‌కెక్కించ‌గా అది సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జ‌పాన్ న‌గ‌రాల‌పై అమెరికా అణుబాంబ్ దాడుల‌ను కామెరూన్ సినిమా గా తీస్తుండ‌డం నిజంగా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే తెలిసిన క‌థ‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం నిజంగా ఎగ్జ‌యిట్ చేస్తోంది.


Recent Random Post: