
గత నెల మలయాళంలో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీ భారీ విజయం సాధించింది. కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కేవలం ₹10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి, ₹50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. జీతూ అష్రాఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి భార్యగా నటించినా, ఆమె పాత్రకు తక్కువ ప్రాధాన్యత దక్కింది. సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందించగా, తెలుగు నిర్మాతలు డబ్బింగ్ హక్కులు తీసుకున్న ఈ చిత్రం ఆలస్యంగా మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. ఇక వారం తిరక్కుండానే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో మల్టీలాంగ్వేజ్ ఆప్షన్లతో స్ట్రీమింగ్కి అందుబాటులోకి వచ్చింది.
ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కథానాయకుడు హరిశంకర్ (కుంచకో బోబన్) అత్యధిక కోపం, దూకుడుతో ఉండే పోలీస్ ఆఫీసర్. అతని ఆగ్రహం కారణంగా DSP స్థాయి నుంచి SIగా డిమోషన్కు గురవుతాడు. ఒక నగల దొంగతనం కేసు విచారణలో అతను నడిపే దర్యాప్తు ఊహించని మలుపులు తిరుగుతుంది. టీనేజ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తన పెద్ద కుమార్తె మృతి వెనుక అసలు కారణం బయటపడటంతో హరిశంకర్ కేసును మరింత సీరియస్గా తీసుకుంటాడు. విచారణ కొనసాగించేప్రతిసారీ మరికొందరు మృతి చెందుతారు. చివరికి ఈ కేసు బెంగళూరులోని ఓ డ్రగ్స్ గ్యాంగ్ వరకు దారి తీస్తుంది. అసలు ఆ నేరానికి ఎవరు బాధ్యులు? హరిశంకర్ ఎలా పరిష్కరించాడు? అనేదే సినిమా కథ.
కథ పరంగా కొత్తదనం తక్కువే అయినా, ఆసక్తికరమైన స్క్రీన్ప్లే సినిమాను బోర్ లేకుండా చేస్తుంది. ముఖ్యంగా విలన్ గ్యాంగ్ కుర్రాళ్ల క్యారెక్టరైజేషన్ కార్తీ నటించిన నా పేరు శివ సినిమాను గుర్తు తెస్తుంది. అయితే ఈ కథనానికి ఇచ్చిన ట్రీట్మెంట్, క్లైమాక్స్ ట్విస్టులు ఆసక్తిని పెంచాయి. దర్శకుడు ప్రారంభంలోనే హంతకులెవరో రివీల్ చేసేశాడు. అయినప్పటికీ, కథనం దర్యాప్తు ప్రక్రియను థ్రిల్లింగ్గా మలచడం వల్ల ప్రేక్షకుడిని ఆసక్తిగా ఉంచుతుంది. అయితే ఇది ఎప్పుడూ చూడని కొత్త కాన్సెప్ట్ అనిపించకపోవచ్చు. కానీ అంచనాలు లేకుండా ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే, ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక మంచి ఆప్షన్.
Recent Random Post:















