ఆ హీరోయిన్ కి తోడుగా ఎవ్వ‌రూ లేరా?

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మండి నియోజ‌క వ‌ర్గం నుంచి బీజేపీ త‌రుపున ఎంపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారంలో భాగంగా నియోజక వ‌ర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఎంపీ గా గెలిచి పార్ల‌మెంట్ లో మొట్ట మొద‌టి సారి కాలు మోపాల‌ని త‌న వంతు ప్ర‌యత్నాల‌న్నీ చేస్తున్నారు. కానీ ఆమెకి మ‌ద్ద‌తుగా మాత్రం బాలీవుడ్ ప‌రిశ్ర‌మ నుంచి ఏ ఒక్క‌రు నిల‌బ‌డిన వైనం క‌నిపించ‌లేదు. క‌నీసం సోష‌ల్ మీడియాలో కూడా ఎవ‌రూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు.

పోటీ చేస్తోంది అన్న సంద‌ర్భంగా కూడా ఎవ‌రూ విషెస్ కూడా పోస్ట్ చేయ‌లేదు. మ‌రి బీహైండ్ సోష‌ల్ మీడియా వెనుకైనా ఫోన్లు చేసి మ‌ద్ద‌తిస్తున్నారా? లేదా? అన్న‌ది తెలియ‌దు. ఇదే ఎన్నిక‌ల్లో హేమా మాలిని… అరుణ్ గోవిల్.. గోవిందా…సురేష్ గోపీ ..ర‌వి కిష‌న్..రూపా గంగూలీ లాంటి వారు కూడా వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ల‌కి మాత్రం కొంద‌రు వెనుక నుంచి మ‌ద్ద‌తు తెలుపుతున్నట్లు ప్ర‌చారంలోకి వ‌స్తోందిగానీ…కంగ‌న విష‌యంలో మాత్రం ఇండ‌స్ట్రీ మౌనం వ‌హిస్తుంద‌నే అంశం చ‌ర్చ‌కొస్తుంది.

అయితే అందుకు కార‌ణంగా కంగ‌న మూక్కు సూటి త‌త్వ‌మ‌నే కొంద‌రంటున్నారు. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా కంగ‌న‌కి పేరుంది. కాస్టింగ్ కౌచ్ పై నిర్మొహ‌మాటంగా మాట్లాడిన న‌టి. కొంత మంది ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌పై కూడా కంగ‌న గ‌తంలో ఆరోప‌ణ‌లు చేసారు. దర్శ‌కులు ఆమె ప‌ట్ల న‌డుచుకున్న తీరుకావొచ్చు..పారితోషికం విష‌యంలో నిర్మాత‌ల‌తో వివాదాలు కావొచ్చు. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే న‌టుడు హృతిక్ రోష‌న్ తో రిలేష‌న్ షిప్ వ్య‌వ‌హారంపై కంగ‌న చేసిన ఆరోప‌ణ‌లు బాలీవుడ్ లో పెద్ద దుమార‌మే రేపిన సంగ‌తి తెలిసిందే.

అలాగే మీటూ ఉద్య‌మ స‌మ‌యంలో కంగ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇర‌కాటంలో ప‌డేసాయి. ఆ కార‌ణంగా ఇత‌ర బ్యాన‌ర్ల‌లో అవ‌కాశాలు తగ్గ‌డంతో సొంతంగా బ్యాన‌ర్ స్థాపించి సినిమాలు నిర్మించ‌డం మొదులు పెట్టింది. ఇవ‌న్నీ కంగ‌న‌ని బాలీవుడ్ లో రాజ‌కీయంగా ఒంటిరిని చేసిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఈ ఒంట‌రి పోరాటంలో నెగ్గాలంటే కంగ‌న ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల్సిందే. ఇక టాలీవుడ్ నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఇండ‌స్ట్రీ నుంచి పెద్ద మ‌ద్ద‌తు ల‌భిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


Recent Random Post: