ఇళయరాజా ఫోటోలకు కోర్టు నిషేధం!

Share


భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన దిగ్గజ స్వరకర్త ఇళయరాజా తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కారణం—వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తూ జరుగుతున్న దుర్వినియోగం.

ఇళయరాజా తెలిపిన వివరాల ప్రకారం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర వేదికల్లో తన చిత్రాలను ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి, వాణిజ్యపరంగా వినియోగిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నట్లు చెప్పారు. ఇది తన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన అని కోర్టుకు వివరించారు. అందుకనే తన ఫోటోలను ఇకపై ఎవరూ తన అనుమతి లేకుండా ఉపయోగించరాదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారించిన మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ, ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇకపై ఇళయరాజా ఫోటోలను పోస్టుల్లో వాడే వారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు ఆదేశాలను అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులు న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి… జర జాగ్రత్త బాస్!


Recent Random Post: