
విశ్వనటుడు కమల్ హాసన్ తన సొంత పార్టీ మక్కల్ నీది మయ్యం ద్వారా తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కానీ రాజకీయ రంగంలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. ప్రస్తుతం పార్టీ శాంతంగానే ఉంది, ఇక కమల్ పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించారు.
ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రం థగ్ లైఫ్ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించగా, ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందనను పొందింది. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఆడియో ఈవెంట్‌లో కమల్ హాసన్ తన రాజకీయ ప్రయాణం గురించి హృదయాన్ని తాకే వ్యాఖ్యలు చేశారు. “నేను ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు. నాకు అభిమానులకి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక రాజకీయాల్లోకి వచ్చాను,” అని చెప్పారు.
“ఎల్ధామ్ రోడ్డులో నడుస్తున్న సాధారణ బాలుడిని. బాలచందర్ సార్ నాకు ఫోన్ చేసి నటుడవ్వాలని చెప్పారు. ఆయన వల్లే నా సినీ జీవితం మొదలైంది. ఇప్పటివరకు 233 సినిమాల్లో నటించాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, అభిమానుల ప్రేమే నాకు బలంగా నిలిచింది. మీ మద్దతే నా కన్నీళ్లను తుడిచింది,” అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
“నాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఏమిటో అప్పట్లో అర్థం కాలేదు. కానీ గత 40 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్నాను. నా రాజకీయ ప్రయాణం నా అభిమానుల పట్ల నా కృతజ్ఞతగా ప్రారంభమైంది. నాతో కలిసి పనిచేసిన వారు ఇప్పుడు సమాజంలో గొప్ప స్థానాల్లో ఉన్నారు,” అని ఆయన అన్నారు.
Recent Random Post:














