కామెడీ ఫార్ములాకు గుడ్‌బై చెప్పిన కోన వెంకట్!

Share


టాలీవుడ్‌లో ప్రతి రచయితకు తనకు తానుగా ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కొన్ని కథలు చూస్తే అవి ఎవరు రాశారో చెప్పేయగలిగేంతగా వారి స్టైల్‌ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి ఓ డిస్టింక్ట్ రైటింగ్ స్టైల్‌తో చాలాకాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో కోన వెంకట్ ఒకరు. కామెడీకి కంటెంట్‌ని మిక్స్ చేస్తూ కమర్షియల్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ రచయిత, ‘ఢీ’, ‘రెడీ’, ‘అదుర్స్’, ‘దూకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఒకప్పుడు స్టార్ రైటర్‌గా దూసుకెళ్లాడు.

అయితే ఇటీవల కాలంలో కోన వెంకట్ నుంచి మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు రాలేదు. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోన వెంకట్ తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

‘ఢీ’ తర్వాత వచ్చిన విజయంతో అదే ఫార్ములాను అనేక సినిమాల్లో ఫాలో అయ్యానని, అవన్నీ కమర్షియల్‌గా విజయవంతమయ్యాయని చెప్పారు. కానీ అదే సమయంలో ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదురయ్యాయని, “ఈ బకరా కామెడీల నుంచి కోన వెంకట్ ఎప్పుడైనా బయట పడతాడా?” అనే ప్రశ్నలు వినిపించాయని చెప్పారు. ఈ కామెంట్స్ తనను తీవ్రంగా ప్రభావితం చేశాయనీ, చివరికి తనకే తన స్టైల్‌పై బోర్ వచ్చిందని ఒప్పుకున్నారు.

“హీరో వేరే ఇంటికి వెళ్లడం, అక్కడి వారిని మోసం చేయడం, అలా వచ్చే కామెడీ ట్రాక్‌లు అన్నీ ఒకే ఫార్ములాగా మారిపోయాయి. పండగ చేస్కో సినిమా తర్వాత ఇక ఆ కాన్సెప్ట్ మీద కథలు రాయలేదని” కోన వెంకట్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం కోన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఓ భారీ ప్రాజెక్ట్ కోసం కథపై పని చేస్తున్నట్టు తెలిపారు. ఈ కథ సంప్రదాయాన్ని మెయింటైన్ చేస్తూనే వినూత్నంగా ఉంటుందని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని చెప్పారు. అదే విధంగా బాలీవుడ్ సీక్వెల్ ప్రాజెక్ట్ ‘నో ఎంట్రీ 2’ కోసం కూడా తాను పని చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహించనున్నారు.


Recent Random Post: