
కొన్ని సినిమాలు ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ రిజల్ట్‌ను చూసుకుని, ఇతర భాషల్లో విడుదల చేయాలా వద్దా అన్న నిర్ణయానికి వస్తుంటాయి. ఇప్పటికే డబ్బింగ్ పూర్తయ్యినా, రిలీజ్ ఖర్చులు కూడా రాకపోవచ్చన్న భయంతో ఆ వెర్షన్‌ను ఆపేస్తారు. గతంలో ఇలాంటి ఉదాహరణలు చాలానే చూశాం. ఇప్పుడు అలాంటి పరిస్థితినే మరో సినిమా ఎదుర్కొంటోంది.
ఆ సినిమానే కార్తీ నటించిన ‘వా వాతియార్’. ఈ సినిమాను తెలుగులో ‘అన్న గారు వస్తారు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయాలని మొదట ప్లాన్ చేశారు. కార్తీ పేరుకే తమిళ హీరో అయినప్పటికీ, తెలుగులోనూ అతనికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమా దాదాపుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంటుంది. వా వాతియార్ విషయంలో కూడా అదే వ్యూహం అనుసరించాలని భావించారు.
అసలు ప్లాన్ ప్రకారం చూస్తే, ఈ సినిమా డిసెంబర్ నెలలోనే తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సింది. కానీ ఆర్థిక సమస్యలు, కోర్టు జోక్యం కారణంగా సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో సంక్రాంతికి విజయ్ జననాయకన్ పోటీ నుంచి తప్పుకోవడంతో, పెద్దగా ప్రిపరేషన్ లేకుండానే వా వాతియార్‌ను తమిళంలో సడెన్‌గా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాబట్టలేకపోయింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కథనం ఆడియన్స్‌ను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. మ్యూజిక్, ఎంజీఆర్ సెంటిమెంట్, దర్శకుడు నలన్ మేకింగ్… ఏ అంశం కూడా సినిమాను నిలబెట్టలేకపోయింది. ఫలితంగా వా వాతియార్ సినిమా కార్తీ కెరీర్‌లో టాప్ 3 డిజాస్టర్లలో ఒకటిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒక్కటే… ఈ సినిమాను తెలుగులో ‘అన్న గారు వస్తారు’ పేరుతో రిలీజ్ చేస్తారా? లేక తమిళ రిజల్ట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆపేస్తారా? అన్నది. నిర్మాతలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.
Recent Random Post:















