కార్తీ29 లో నాని అతిథి పాత్ర?

Share


ప్రతిభావంతుడైన హీరో కార్తీ కి తమిళంతో పాటు తెలుగులో కూడా విశేషమైన గుర్తింపు ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో కార్తీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు, కార్తీకి కూడా టాలీవుడ్ మీద, తెలుగు ప్రేక్షకుల మీద ప్రత్యేక అభిమానం ఉంది. ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గతేడాది విడుదలైన సత్యం సుందరం సినిమాతో ప్రేక్షకులను అలరించిన కార్తీ, ఈ ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హిట్ 3 క్లైమాక్స్ లో అతిథి పాత్రలో మెరిశారు.

ఆ తర్వాత దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తో కలిసి సర్దార్ 2 షూటింగ్ లో పాల్గొని, ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేశారు. ఇక ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం, తాతాన్ ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కార్తీ29 కోసం సిద్ధమవుతున్నారు. తమిళ్ గతంలో దర్శకుడు వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేయడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1960ల నేపథ్యంలో రామేశ్వరం తీరాన్ని ఆధారంగా చేసుకుని, స్మగ్లింగ్ నేపథ్యంతో ఒక పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. నివిన్ పౌలీ, జయరామ్ వంటి ప్రముఖ నటీనటులు ఇందులో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని ఓ ప్రత్యేక పాత్ర లేదా గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత కార్తీ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 షూటింగ్ కు హాజరవుతారు. ఖైదీ 2 ఈ ఏడాది చివరినాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇవి కాకుండా పలు సినిమాలతో కార్తీ ఫుల్ బిజీగా ఉన్నారు.


Recent Random Post: