
ఒక సినిమా విడుదలవ్వాలంటే, అది ప్రేక్షకుల దృష్టికి చేరి, థియేటర్ల వరకు తీసుకెళ్లడం మేకర్స్‌కి పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా స్టార్ కాస్ట్‌పై ఆధారపడకుండా, కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకర్షించాలి అంటే నిజంగానే కత్తి మీద సామే. అందుకే, వినూత్న ప్రమోషన్ ప్లాన్స్‌తో అంచనాలు పెంచి, ఎలాగైనా ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడీ ట్రెండ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’ కూడా ముందుంది. ఇప్పటికే అమెజాన్ ఈ–కామర్స్‌తో కలసి డెలివరీ ఐటమ్స్‌పై సినిమా ప్రమోషన్ చేసిన ఈ బృందం, ఇప్పుడు మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది.
ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఆడియో ఫంక్షన్స్ మాత్రమే ఉండేవి. తర్వాత అవి ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా మారాయి. తమిళ్‌లో ఇప్పటికీ ఆడియో వేడుకలే చేస్తున్నప్పటికీ, ‘కూలీ’ కోసం మాత్రం ‘కూలీ అన్‌లీష్డ్’ పేరుతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సన్ పిక్చర్స్ యూట్యూబ్ లైవ్ ఇవ్వకుండా, తమ సన్ టీవీ ఛానల్‌లోనే ఎక్స్క్లూజివ్‌గా ప్రసారం చేసింది.
ఇప్పుడు ఆసక్తికర విషయం ఏమిటంటే—ఈ కూలీ ఈవెంట్‌ను తొలిసారిగా తెలుగులో కూడా ప్రసారం చేయబోతున్నారు. ఆగస్టు 15వ తేదీ రాత్రి 9:30 గంటలకు, సన్ నెట్‌వర్క్‌లో భాగమైన జెమినీ టీవీలో ఇది టెలికాస్ట్ అవుతుంది. అంతేకాదు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తమిళంలో పాడిన పాటల స్థానంలో తెలుగు వెర్షన్ పాటలు వినిపించనున్నారు. తమిళ్ స్పీచ్‌లకు కూడా తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తారు.
దీంతో, తమిళ్ డబ్బింగ్ సినిమాల తర్వాత ఇప్పుడు ఈవెంట్లను కూడా డబ్బింగ్ చేయడం ఇదే మొదటి సారి కావడం ప్రత్యేకత. నెటిజన్స్ కూడా ఇది కొత్త ట్రెండ్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్‌గా, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Random Post:














