కృతి శెట్టి కెరీర్‌కు బ్రేక్ ఎప్పుడు?

Share


ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి, ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ వంటి హిట్లతో తన కెరీర్ ఊపందుకుంటుందని అందరూ భావించారు. కానీ అంచనాలకు భిన్నంగా ఆ తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ రివర్స్ గేర్ వేసింది. వరుస పరాజయాలతో తెలుగు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె తమిళ ఇండస్ట్రీ వైపు మళ్లింది. అయితే అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సాలిడ్ బ్లాక్‌బస్టర్ ఇప్పటివరకు దక్కకపోవడం ఆమెకు సవాలుగా మారింది.
కార్తీతో నటించిన ‘అన్నగారు వస్తారు’ సినిమాపై కృతి శెట్టి భారీ అంచనాలు పెట్టుకుంది. అందుకే ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంది. అయితే నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల ఇంకా అనిశ్చితిలోనే ఉంది. ఫిబ్రవరి విడుదల అని చర్చ జరుగుతున్నప్పటికీ, దానికి గ్యారెంటీ లేదనే టాక్ వినిపిస్తోంది.
ఇదొక్కటే కాకుండా డిసెంబర్ 18న విడుదల కావాల్సిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా వాయిదా పడినట్లు ఇటీవలే వెల్లడైంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో బడ్జెట్ విషయంలో నిర్మాతకు తలెత్తిన విభేదాలే ఈ ఆలస్యానికి కారణమని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ లాంటి క్రేజీ హీరో నటించిన సినిమా కావడంతో బిజినెస్ పరంగా మంచి డిమాండ్ ఉన్నా, దాన్ని క్యాష్ చేసుకునే దిశగా నిర్మాణ సంస్థ ముందడుగు వేయడం లేదు.
ఈ విధంగా ఒకే నెలలో వారం గ్యాప్‌లో విడుదల కావాల్సిన కృతి శెట్టి రెండు సినిమాలు వాయిదా పడటం గమనార్హం. రెండూ సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్నవే కావడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కృతి శెట్టి పాత్ర లేకపోయినా, దురదృష్టవశాత్తూ ఆమె సినిమాలు సరైన సమయానికి ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నాయి.
ఇక తెలుగు ప్రేక్షకుల్లో ఆమె పట్ల కనెక్టివిటీ తగ్గిన మాట వాస్తవం. రష్మిక మందన్న, శ్రీలీలలాగా తరచూ కనిపిస్తూ ఉంటే ప్రేక్షకులతో అనుబంధం నిలుస్తుంది. కానీ కృతి శెట్టి చాలా గ్యాప్ తీసుకోవడం వల్ల ఆ కనెక్షన్ మిస్సైంది. తెలుగులో ఆమె చేసిన మనమే, కస్టడీ, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. మలయాళంలో ఏఆర్ఎం ఓ మోస్తరు ఫలితం సాధించగా, రవి మోహన్‌తో చేసిన జీనీ కూడా విడుదల విషయంలో ఆలస్యమవుతోంది.
మొత్తంగా చూస్తే, టాలెంట్ ఉన్నా సరైన టైమింగ్, సరైన రిలీజ్ ప్లానింగ్ లేకపోవడం కృతి శెట్టికి ప్రధాన సమస్యగా మారింది. ఆమె కెరీర్‌కు మళ్లీ బలమైన బ్రేక్ ఇచ్చే సినిమా ఎప్పుడు వస్తుందో చూడాల్సిందే.


Recent Random Post: