కోట-బాబు మోహన్ స్నేహానికి మిగిలిన మధుర జ్ఞాపకాలు

Share


తెలుగు సినీప్రేక్షకుల గుండెల్లో చెరగని జోడీ కోట శ్రీనివాసరావు – బాబు మోహన్. వాళ్లిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ప్రత్యేకించి ‘మామగారు’ చిత్రంలో వారి కామెడీ సీన్లు మరువలేనివి. ఆన్ స్క్రీన్‌లోనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లో కూడా వాళ్ల మైత్రి గాఢమైనదే. ఇద్దరూ కలిసే ఎదిగారు, కలిసే ఫిలింనగర్‌లో ఇండ్లు కట్టుకున్నారు.

ఇటీవల బాబు మోహన్ తాము ఎలా ఇండ్లు కట్టుకున్నామో, కోటతో తమ స్నేహ బంధం ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నారు. “కోట అన్నా ఇప్పుడు ఉన్న స్థలానికి ముందుగా నేను అడ్వాన్స్ ఇచ్చాను. కానీ ఆయన వచ్చి, ‘నువ్వే కొంటున్నావా? నాకు ఇస్తే బాగుండేది కదా!’ అన్నాడు. వెంటనే నేను ‘తీసుకో అన్నా’ అన్నాను. అడ్వాన్స్ కూడా తిరిగి తీసుకోలేదు. తరువాత పక్కనే ఉండే ఓ ఆగిపోయిన భవనాన్ని కోట అన్ననే నాకు చూపించాడు. ‘నువ్వే తీసుకో’ అన్నాడు. అంతే నేనూ తీసుకున్నాను.

అప్పుడు కోట అన్నా, ‘ఓరేయ్ పెద్దగా కట్టకు, చిన్నగా కట్టుకోరా!’ అని సలహా ఇచ్చాడు. నేను నవ్వుతూ, ‘కడతాం అన్నా, అంతే పెద్దగా కడతాం!’ అన్నాను. ‘చూద్దాం ఏం కడతావో’ అని అన్నాడు. తరువాత ఎక్కడ కనిపించినా, ‘ఏరా ఇల్లు కడతావా?’ అని అడిగేవాడు.

ఒకసారి మూడో అంతస్తు స్లాబ్ వేస్తున్నప్పుడు, కోట అన్న వచ్చి చూసి, ‘ఏరా! మూడో ఫ్లోర్ వేస్తున్నావా!’ అని అడిగాడు. ‘అవును అన్నా’ అని చెప్పగా, ‘అంతకంటే ముందు నువ్వు కడతానన్నావ్ గదా.. కోడకా!’ అంటూ నవ్వేశాడు. వాడిని నేను చాలా ఏడిపించేవాడిని. కానీ అలాంటి ఏడిపింపులు కూడా మేం నవ్వుకుంటూ పంచుకునేలా మా మధ్య స్నేహం గొప్పగా ఉండేది.”

ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఇక లేరు అనే వార్త విని బాబు మోహన్ చలించిపోయారు. తన జీవితంలో మిత్రుడిని కోల్పోయిన బాధ ఆయన కళ్లలో కనిపిస్తోంది. ఈ మిత్రబంధం, ఆప్యాయత చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటికీ కమ్మటి అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.


Recent Random Post: