
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్ బీగా అద్భుతమైన పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆయన అభిమాన నటుడిగా నిలిచారు. ఎనిమిది పదుల వయసులో కూడా తన ఎనర్జీ లెవెల్స్‌తో, యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. దీనికి ఇటీవల విడుదలైన కల్కి 2898 AD సినిమా స్పష్టమైన ఉదాహరణ. ఆ చిత్రంలో తన అద్భుతమైన నటనతో మరోసారి తన స్థాయిని చాటుకున్నారు అమితాబ్ బచ్చన్.
నటుడిగా ఒకవైపు, బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రముఖ కార్యక్రమానికి హోస్టుగా మరోవైపు బిజీగా కొనసాగుతున్న బిగ్ బీ తాజాగా లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకొని అందరినీ భావోద్వేగానికి గురి చేశారు. సాధారణంగా ఒక షో రెండు మూడు సీజన్లు పూర్తి చేస్తే, ఆ అనుబంధాన్ని గుర్తుచేసుకొని హోస్టులు భావోద్వేగానికి లోనవుతుంటారు. కానీ అమితాబ్ బచ్చన్‌కు ఒక షోతో ఉన్న బంధం మాత్రం 25 ఏళ్లుగా విడదీయరానిది. అదే కౌన్ బనేగా కరోడ్పతి.
సామాన్యులకు అగ్నిపరీక్షలాంటిది ఈ షో. ఎంతోమంది ఇందులో పాల్గొని ఆ పరీక్షను దాటుకుని కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. గత 17 సీజన్లుగా ఈ షోను హోస్ట్‌గా ముందుకు తీసుకెళ్లుతూ అపారమైన ఆదరణ పొందారు అమితాబ్ బచ్చన్. అలాంటి ఈ షోలోనే ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కూడా కలచివేసింది.
అసలు విషయానికి వస్తే… కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17 గ్రాండ్ ఫినాలే ఈరోజు అత్యంత భావోద్వేగంగా జరగనుంది. ఈ సందర్భంగా తన 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అమితాబ్ బచ్చన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
“నా జీవితంలో మూడో వంతు మీతో గడపడం నా అదృష్టం” అంటూ ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బీ ఇలా భావోద్వేగానికి లోనవడాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ ఇక్కడితో ముగిసిపోతుందా? ఇది చివరి సీజన్ కావచ్చా? అనే సందేహాలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ షో కొనసాగితే ఇప్పుడే ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యారు? బహుశా ఇదే ఆఖరి సీజన్ కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
ఇక ఈ ముగింపు ఎపిసోడ్‌లో అగస్త్య నంద సందడి, కికు శారదా హాస్యం, అలాగే అమితాబ్ బచ్చన్ అరుదైన సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అభిమానులకు ఇది మరచిపోలేని ఎపిసోడ్‌గా మారనుందని తెలుస్తోంది.
Recent Random Post:















