సంగీత దర్శకుడు దిలీప్ కుమార్.. ఈయనెవరో అని ఆలోచిస్తున్నారా? అదేనండీ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన అసలు పేరు దిలీప్ కుమారే. అయితే రెహమాన్ పేరు వినగానే.. మనసును హత్తుకునే సంగీతం అందరికీ గుర్తుకొస్తుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలకు తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు. తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో సినిమాలకు వర్క్ చేసి అలరించారు. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకుని సత్తా చాటారు.
ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ రోజాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రెహమాన్ కు సంగీత ప్రపంచంలో స్పెషల్ ఛాప్టర్ ఉంటుంది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి ఆల్బమ్స్ ను అందించి ప్రత్యేక ట్రెండ్ ను సృష్టించారు. రోజా, బాంబే, దిల్ సే, తాల్, ప్రేమికుడు, జెంటిల్ మ్యాన్, ఇండియన్, రంగీలా, లగాన్, సఖి, స్వదేశ్, రంగ్ దే బసంతి, గురు, ఏ మాయ చేసావే వంటి అనేక సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ను అందించారు.
కానీ కొన్ని కొంత కాలంగా రెహమాన్ అవుట్ పుట్ అనుకున్నంత స్థాయిలో ఉండటం లేదు. లింగా, మొహెంజొదారో, బిగిల్, మెర్సల్, హీరోపంతి 2 వంటి చిత్రాల్లో రెహమాన్ మార్క్ కనిపించలేదని చెప్పాలి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ కు అందించిన మ్యూజిక్ కూడా అంచనాలకు తగ్గట్టు లేదు. దీంతో సినిమాల్లో రెహమాన్ మార్క్ మిస్ అవుతుందని విమర్శలు వస్తున్నాయి.
ఇదే సమయంలో రెహమాన్ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు! తన వర్క్ తో మళ్లీ తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు. మాలీవుడ్ ఆడు జీవితం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. బాలీవుడ్ చమ్కిలా మూవీతో కూడా అలరించారు. ఇటీవల వచ్చిన ధనుష్ రాయన్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే రీతిలో ఇచ్చారు. ఎన్నో సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే నిలబెట్టేశారు. రివ్యూల్లో అంతా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇంతకు ముందు వినని కొత్త వాయిద్యాలను రాయన్ మూవీ కోసం రెహమాన్ వాడినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాయన్ తో వరుసగా మూడు సినిమాల ద్వారా తన మార్క్ చూపించారు రెహమాన్. త్వరలోనే మరిన్ని సినిమాలకు సంగీతాన్ని అందించనున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బుచ్చి బాబు ప్రాజెక్ట్ కు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరి కొత్త సినిమాలతో రెహమాన్.. ఎలా అలరిస్తారో వేచి చూడాలి.
Recent Random Post: