ఘాటితో రీ-ఎంట్రీకి రెడీ అనుష్క

Share


అనుష్క శెట్టి తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన అరుదైన నటి. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే బాహుబలి తర్వాత అనుష్క పెద్దగా రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. మధ్యలో కొన్నేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి విజయాన్ని అందుకున్నా, మళ్లీ కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు అనుష్క ఘాటి అనే ఇంటెన్స్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా కాలంగా ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. కొంచెం లేటయినా, ఈ రిలీజ్ డేట్ మాత్రం సినిమాకు బాగా అనుకూలంగా మారింది.

ముందుగా అదే రోజున విడుదల కావాల్సిన మిరాయ్ వాయిదా పడగా, రవితేజ మాస్ జాతర కూడా రిలీజ్ నుంచి తప్పుకుంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా వచ్చిన వార్-2, కూలీ సినిమాలు ఇప్పటికే తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ మొదటి వారంలో బాక్సాఫీస్ ఖాళీగా ఉంది. ఈ ఫ్రీ విండో ఘాటికి పెద్ద పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది.

ట్రైలర్‌ చూస్తే ఘాటి కంటెంట్ బలంగా ఉన్న సినిమా అని స్పష్టంగా తెలుస్తోంది. క్రిష్ ప్రత్యేకమైన కథన శైలి, అనుష్క స్టార్ పవర్ కలిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఘాటి ఎంతగా ఉపయోగించుకుంటుందో చూడాలి.


Recent Random Post: