చాహల్ విడాకులు, 60 కోట్ల ఒప్పందం?

Share


భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య విబేధాలున్నాయనే పుకార్లు గత కొన్ని నెలలుగా తీవ్రంగా చక్కర్లు కొడుతున్నాయి. గత సంవత్సరం చివర్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అంతేకాకుండా, ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తొలగించడం కూడా ఈ వార్తలకు బలాన్నిచ్చింది.

అయితే, ధనశ్రీ అప్పటికప్పుడే చాహల్‌తో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూనే ఉండటంతో, ఈ పుకార్లు నిజమేనా? లేక కేవలం వదంతులా? అనే చర్చ నడుస్తోంది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ జంట విడిపోవడం ఖాయమని, విడాకుల పరిష్కారంలో భాగంగా చాహల్ తన భార్య ధనశ్రీకి దాదాపు రూ.60 కోట్లు భరణంగా చెల్లించనున్నాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు చాహల్ గానీ, ధనశ్రీ గానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీరు ఈ పుకార్లను ధృవీకరించలేదు, అలాగే ఖండించనూ లేదు. గతంలో ధనశ్రీ తమ మధ్య విబేధాల గురించి వస్తున్న వార్తలను పూర్తిగా కొట్టిపారేసి, అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. అనామక వ్యక్తులు నిరాధారమైన వాదనలు చేస్తున్నారు అంటూ ఆమె ఆరోపణలు చేశారు.

చాహల్ కూడా గత నెలలో ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దని కోరాడు. ఈ రూమర్స్ తన కుటుంబానికి మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు.

2020లో కోవిడ్ సమయంలో చాహల్-ధనశ్రీల పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్ వీడియోలను చూసిన చాహల్, ఆమె స్టైల్‌ను ఇష్టపడి డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో ధనశ్రీను సంప్రదించడం అతనికి మరింత దగ్గరయ్యే అవకాశం కల్పించింది. టీచర్-స్టూడెంట్ బంధం క్రమంగా ప్రేమగా మారి, ఆ ఏడాదికే వివాహ బంధానికి దారితీసింది. కానీ పెళ్లి తర్వాత నాలుగేళ్లకే వీరి మధ్య విబేధాలు రావడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈ వార్తల మధ్య, చాహల్ ఇటీవల తన స్నేహితులు, ఆర్జే మహవాష్ సహా ఇతరులతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటికీ చాహల్, ధనశ్రీ ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో, వీరి మధ్య నిజంగా ఏం జరుగుతోంది? అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.


Recent Random Post: