చిన్న సినిమాలకు ‘జెట్లీ’ ప్రమోషన్ మాస్టర్ క్లాస్

Share


ఈ రోజుల్లో చిన్న సినిమాలకు థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించడం పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు సినిమా బాగుంటే మెల్లగా టాక్ పెరిగి లాంగ్ రన్ సాధిస్తుందన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సినిమా ఫలితం చాలా వరకూ తొలి వీకెండ్‌కే తేలిపోతోంది. రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోతే, ఎంత మంచి కంటెంట్ ఉన్నా అది బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపకుండానే కనుమరుగవుతోంది.

ఇటీవలి కాలంలో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి మంచి సినిమాలు సరైన ప్రచారం లేకపోవడం వల్ల ప్రేక్షకుల దృష్టికి రాకుండా పోయాయి. టాక్, రివ్యూలు బాగున్నప్పటికీ సినిమా గురించి తెలుసుకునేలోపే థియేటర్ల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సినిమా మేకింగ్ దశ నుంచే క్యూరియాసిటీ పెంచేలా ప్రమోషన్లు చేయడం, ఇంట్రెస్టింగ్ ప్రోమోలు కట్ చేయడం ఎంత కీలకమో మరోసారి రుజువవుతోంది.

ఈ విషయంలో దర్శకుడు రితేష్ రాణా తీస్తున్న ‘జెట్లీ’ సినిమా ప్రమోషన్లు చిన్న సినిమాలకు ఒక గట్టి పాఠంలా నిలుస్తున్నాయి. కమెడియన్ సత్యను లీడ్ రోల్‌లో పెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, అనౌన్స్‌మెంట్‌ నుంచే వినూత్న ప్రచారంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సత్య “ఐ యామ్ డన్ విత్ కామెడీ” అంటూ ఫస్ట్ లుక్‌కు ఇచ్చిన ట్యాగ్‌లైన్ నుంచే ఆసక్తి మొదలైంది. హీరోయిన్ ఇంట్రడక్షన్, వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ లాంచ్ వంటి ప్రతి సందర్భంలోనూ ఫన్నీ వీడియోలతో టీమ్ ప్రత్యేకంగా కనిపించింది.

సత్యపై అతడే వేసుకున్న పంచులు, టీమ్ నుంచి వచ్చిన సెటైర్లు ఈ ప్రమోషన్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ పూర్తిగా వినోదాత్మకంగా ఉండగా, టీజర్ లాంచ్ ఈవెంట్ మరింత వైరల్ అయింది. దర్శకుడు రితేష్ రాణా ప్రసంగిస్తున్న సమయంలో సత్య ఇచ్చిన ‘స్పీచ్ పేపర్’ ఎపిసోడ్ స్టేజ్‌పై, సోషల్ మీడియాలోనూ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తింది.
ఇలా వెరైటీగా, ఫన్నీగా సాగుతున్న ప్రమోషన్లతో ‘జెట్లీ’ సినిమాపై మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. కంటెంట్ కూడా ఈ స్థాయిలో ఆకట్టుకుంటే, ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా–2’ తరహాలో ‘జెట్లీ’ కూడా చిన్న సినిమా స్థాయిని దాటి పెద్ద హిట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


Recent Random Post: