చిరంజీవి కొత్త పాట అడ్వాన్స్ రిలీజ్ – సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘శశిరేఖా ఓ ప్రసాదూ’

Share


మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గీత రచయిత అనంత శ్రీరామ్, గాయకులు శశిరేఖా, మధుప్రియ కలిసి అందించిన తాజా పాట ఒక్కరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ పాట రేపు విడుదల కావాల్సి ఉండగా, అభిమానులకు అడ్వాన్స్ గిఫ్ట్‌లా ఇవాళే ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ అయ్యింది.

ఈ పాటను ముందుగా విడుదల చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ‘రేఖా, ప్రసాదూ’ అంటూ చిరంజీవి–నయనతార ఒకరినొకరు పలకరించుకునే ప్రోమోపై కొంత నెగిటివిటీ రావడంతో, అది ఎక్కువగా వైరల్ కాకుండా ఉండేందుకు ఫుల్ సాంగ్‌ను వెంటనే విడుదల చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ ప్రత్యేక ప్రోమోను విడుదల చేయాల్సి ఉండటంతో, ఈ రెండు అప్‌డేట్స్ మధ్య సరైన గ్యాప్ ఉండేలా ఈ పాటను ముందుకు జరిపారు. అనుకున్న సమయానికే పాట ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ కావడం విశేషం.

పాట విషయానికి వస్తే, అనిల్ రావిపూడి స్టయిల్‌కు తగ్గట్టుగా క్యాచీగా, ఫీల్ గుడ్ టోన్‌లో ఈ సాంగ్ సాగింది. డబ్బున్న అమ్మాయి–మధ్యతరగతి అబ్బాయి మధ్య ప్రేమకథ, ఆ ప్రేమను వ్యక్తపరుచుకునే క్రమంలో వచ్చే చిన్న ఇబ్బందులు, చివరకు అమ్మాయి సంతోషంగా ఒప్పుకోవడం అనే సింపుల్ కాన్సెప్ట్‌తో ఈ పాట రూపొందింది. అనంత శ్రీరామ్ ఈజీగా హార్ట్ టచ్ అయ్యే పదాలతో సాహిత్యం అందించారు. భీమ్స్ సిసిరోలియో మృదువుగా కంపోజ్ చేసిన ఈ ట్యూన్, శశిరేఖా–మధుప్రియల గానంతో మరింత ఆకట్టుకుంటోంది.

‘మీసాల పిల్ల’ తరహాలోనే ఈ పాట కూడా స్లో పాయిజన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘శశిరేఖా, ఓ ప్రసాదూ’ అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేసే జంటలు రాబోయే రోజుల్లో విపరీతంగా కనిపించనున్నాయనే భావన వినిపిస్తోంది.

ఫీడ్‌బ్యాక్ పరంగా చూస్తే, పెద్ద ఎత్తున వాద్యాల హోరు లేకుండా భీమ్స్ మెలోడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన విధానం ప్రశంసలు అందుకుంటోంది. డెబ్భై ఏళ్ల వయసులోనూ గ్రేస్ తగ్గకుండా కనిపిస్తున్న చిరంజీవిని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. విజువల్స్, లొకేషన్స్ అన్నీ సహజత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ రోజు నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి టైటిల్ సాంగ్ షూట్‌ను ప్రారంభించారు. సంక్రాంతి విడుదల లక్ష్యంగా ఎలాంటి మార్పులు లేకుండా సినిమా అనుకున్న టైమ్‌కే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. మిగిలిన పాటలను కూడా ఈ నెలాఖరులోగా వరుసగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


Recent Random Post: