జయా బచ్చన్ సినీ విరామం వెనుకున్న నిజం

Share


ప్రముఖ నటి, ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సాధించిన జయా బచ్చన్—బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్యగా దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీ పొందింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, తరువాత సినిమాలకు దూరమై రాజకీయ జీవితం వైపు మళ్లిన విషయం తెలిసిందే. అనేక ఇంటర్వ్యూల్లో, పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉండే జయా బచ్చన్, ఇటీవల తన నటనకు బ్రేక్ ఇచ్చిన అసలు కారణాన్ని వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచింది.

1963లో సత్యజిత్ రే తెరకెక్కించిన మహానగర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన జయా బచ్చన్, 1971లో అమితాబ్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించింది. 1981లో వచ్చిన సిల్సిలా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న ఆమె, 1995లో డాటర్స్ ఆఫ్ ది సెంచరీ ద్వారా తిరిగి నటన ప్రారంభించింది. చివరిగా 2023లో వచ్చిన రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ కథలో నటించి మళ్లీ సినిమాలకు దూరమైంది.

తన 14 సంవత్సరాల విరామానికి కారణం చెబుతూ జయా బచ్చన్ అన్నారు:
“నాకు షూటింగ్ ఉన్న రోజుల్లో ఇంట్లోనే మేకప్ వేసుకొని బయటకు వెళ్తాను. మా అమ్మాయి దగ్గర ఎక్కువ సమయం ఉన్నట్టు అనిపించాలని అలా చేసేదాన్ని. ఒక రోజు మేకప్ వేస్తుండగా శ్వేతా వచ్చి ‘అమ్మా, ఏమి చేస్తున్నావు?’ అని అడిగింది. షూట్‌కి వెళ్తున్నానని చెప్పగానే, ‘అమ్మా, నువ్వు వెళ్లొద్దు… నాన్నను మాత్రమే పంపించు’ అని అమాయకంగా చెప్పింది.”

“మా ఇంట్లో ఎన్నో పనివాళ్లు ఉన్నా… ఆమెకు ‘అమ్మ తక్కువగా ఉంది’ అనిపిస్తోందని అప్పుడు అర్థమైంది. వెంటనే నిర్ణయం తీసుకున్నాను—నా పిల్లల కోసం సినిమాలకు విరామం ఇవ్వాలని. శ్వేతా ఒక మాటనే నాకు జీవిత నిర్ణయం మార్చించింది” అని జయా చెప్పారు.

మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన కారణాన్ని కూడా ఆమె వివరించారు:
“శ్వేత కోరుకున్నందుకే నేను సినిమాలకు దూరమయ్యాను. అలాగే ఒకే తరహా పాత్రలు రావడం కూడా నాకో విసుగు తెచ్చింది. శ్వేత పెళ్లి తర్వాత ఇంట్లో ఒంటరితనం పెరిగింది. ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపించేది. ఎన్నిసార్లో రహస్యంగా కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ ఒంటరితనం నుంచి బయటపడాలనిపించి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.”

మొత్తమ్మీద, సినిమాలకు దూరం కావడం – మళ్లీ వాటిలోకి రావడం వెనుక ఉన్న నిజమైన భావోద్వేగ కారణాలను జయా బచ్చన్ బయటపెట్టడంతో అది అందరినీ ఆశ్చర్యపరిచింది.


Recent Random Post: