జైలర్ 2లో షారుఖ్ ఎంట్రీ? సెన్సేషన్‌గా మారిన లీక్

Share


సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే చాలు… ఆ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. అలాంటి అరుదైన చరిష్మా ఆయనకే సొంతం. సీనియర్ స్టార్ హీరోల్లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వంటి నటులు ఏ భాషలో సినిమా చేసినా, వారు చేసే ప్రతి ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది.

ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ గురించే సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భారీ మల్టీస్టారర్‌గా, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

మోస్ట్ అవైటెడ్ జైలర్ 2 కోసం ఎంపిక చేస్తున్న నటీనటుల జాబితా రోజు రోజుకీ ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తి, అనుకోకుండా కాస్టింగ్‌పై ఓ పెద్ద లీక్ ఇచ్చారు. ఓ బెంగాళీ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, షారుఖ్ ఖాన్ కూడా జైలర్ 2లో నటిస్తున్నాడు అని వెల్లడించడంతో ఈ వార్త సెన్సేషన్‌గా మారింది.

ఇప్పటి వరకూ జైలర్ 2 కాస్టింగ్ గురించి చిత్రబృందం అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. అలాంటిది మిథున్ నోట ఈ విషయం రావడంతో, రజనీకాంత్–షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో సినిమా వస్తుందనే ప్రచారం ఒక్కసారిగా పీక్స్‌కి చేరింది.

ఇటీవల తనకు బాగా నచ్చిన కథ ఏది అని ప్రశ్నించగా, మిథున్ మాట్లాడుతూ జైలర్ 2 కథ తనను చాలా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో నటీనటుల గురించి మాట్లాడుతూ, మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణన్, శివరాజ్‌కుమార్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారని లీక్ చేశారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ పేరు బయటకు రావడంతో ఈ వార్త మరింత హాట్ టాపిక్‌గా మారింది.

రజనీకాంత్–షారుఖ్ ఖాన్ మధ్య స్నేహం ఈనాటిది కాదు. షారుఖ్ నటించిన ‘రా.వన్’ చిత్రంలో అతిథి పాత్ర కోసం రజనీకాంత్‌ను ఖాన్ స్వయంగా కోరగా, రజనీ వెంటనే అంగీకరించి రోబో పాత్రలో కనిపించారు. సినిమా విజయం సాధించకపోయినా, స్నేహానికి విలువ ఇచ్చిన రజనీపై షారుఖ్‌కు అపారమైన గౌరవం ఉంది.

ఇప్పుడు ఆ స్నేహానికి ప్రతిఫలంగా, జైలర్ 2లో షారుఖ్ అతిథి పాత్రలో నటించాడా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ అది నిజమైతే, ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమాకు భారీ మైలేజ్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం పెద్ద స్టార్ కనిపించాడన్న కారణంతో కాకుండా, పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఈ కాస్టింగ్‌కు పూర్తి న్యాయం జరుగుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Recent Random Post: